ప్రియుడి స్నేహితుడి వేధింపులు.. వివాహిత ఆత్మహత్య

3 Sep, 2022 09:04 IST|Sakshi
అరెస్టయిన జ్యోతీశ్వరన్, శివప్రకాష్‌   

సాక్షి, చెన్నై: భర్త, ఇద్దరు పిల్లలను వదిలి ప్రియుడితో పరారైన మహిళ అనుమానాస్పద రీతిలో మృతి చెందిన సంఘటన కీలక మలుపు తిరిగింది. ప్రియుడి స్నేహితుడు లైంగిక వేధింపులకు గురి చేయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించిన పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. ఈ నెల 29వ తేదీ తిరువళ్లూరు జిల్లా పెద్దకుప్పం కంబర్‌ వీధిలోని ఓ ఇంట్లో కుళ్లిన స్థితిలో మహిళ మృతదేహం లభించడం కలకలం సృష్టించింది.

మృతిపై తిరువళ్లూరు టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ పద్మశ్రీ బబ్బి విచారణ చేపట్టారు. పోలీసుల ప్రాథమిక విచారణలో మృతి చెందిన మహిళ చోళవరం సమీపంలోని ఎరుమై వెట్టిపాళయం గ్రామానికి చెందిన బాబు భార్య అముదగా గుర్తించారు. బాబు పాఠశాల వ్యాన్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. వీరికి జయశ్రీ, కిషోర్‌ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.  

ప్రియుడితో పరార్‌  
కొంత కాలం పాటు సజావుగా సాగిన బాబు కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. అముద  అదే ప్రాంతానికి చెందిన జ్యోతీశ్వరన్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. అనంతరం భర్త పిల్లలను వదిలి అతనితో పరారైంది. రెండేళ్లు ప్రియుడితో సహజీవనం చేసిన తరువాత పెద్దలు పంచాయతీ చేసి అముదను భర్త చెంతకు చేర్చారు. కొంత కాలం భర్తతోనే ఉన్న అముద మళ్లీ ప్రియుడితో పరారై అనుమానస్పద రీతిలో మృతి చెందింది.  
చదవండి: బైక్‌పై డ్రాప్‌ చేస్తామని తీసుకెళ్లి.. యువతిపై లైంగిక దాడి 

ప్రియుడి స్నేహితుడు వేధింపులు భరించలేక 
అముదతో సహజీవనం చేస్తున్న జ్యోతీశ్వరన్‌కు అంతకు ముందే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనంతరం మనస్సు మార్చుకుని భార్య పిల్లల వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయంపై అముద జ్యోతిశ్వరన్‌తో వాగ్వాదానికి దిగింది. నిన్ను నమ్మి భర్త పిల్లలను వదిలి వచ్చానని, ఇప్పుడు తనను నడిరోడ్డుపై వదిలేస్తే ఎక్కడికి వెళ్లాలని నిలదీసింది. జ్యోతీశ్వరన్‌ అముదను తిరువళ్లూరులోని ఇంట్లో వదిలిపెట్టి భార్య పిల్లల వద్దకు వెళ్లిపోయాడు.

వారం రోజులుగా ఒంటరిగా ఉంటున్న అముదను జ్యోతీశ్వరన్‌ స్నేహితుడు శివప్రకాష్‌ లైంగిక వేధింపులకు గురి చేసినట్లు గుర్తించారు. తనతో సహజీవనం చేయాలని ఒత్తిడి పెంచడంతోనే ఆమె మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఆత్మహత్యకు కారణమైన జ్యోతీశ్వరన్, శివప్రకాష్‌లను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు