సాక్షి, చిలుకూరు(కోదాడ): అభం శుభం తెలియని ఏడాదిన్నర బాలుడిని వివాహేతర సంబంధం బలితీసుకుంది. ఈ దారుణ ఘటన బుధవారం సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన సంపంగి శ్రీనివాస్ ఖమ్మం జిల్లా మంచుకొండ గ్రామానికి చెందిన గుగులోతు ఉష వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. వారు కృష్ణా జిల్లా చిల్లకల్లు మండలం అనుమంచిపల్లి గ్రామంలో కొన్ని నెలలుగా ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఉషకు ఇద్దరు పిల్లలు. వీరిలో పెద్ద కుమారుడు సుకుమార్, చిన్న కుమారుడు అంకిత్(ఏడాదిన్నర)లు ఉన్నారు. గత ఆదివారం శ్రీనివాస్ మద్యం తాగి ఇంటికి వచ్చాడు.
తమ సఖ్యతకు అడ్డుగా ఉన్నాడని అంకిత్‌ను కొట్టడంతో కోమాలోకి వెళ్లాడు. ఆ బాలుడిని కోదాడ ఆస్పత్రికి తీసుకురాగా అప్పటికే మృతిచెందాడు. విషయాన్ని కప్పిపుచ్చేందుకు బాలుడి మృతదేహాన్ని చిలుకూరు మండలం అక్షరా పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లేదారిలో అదే రోజు రాత్రి పూడ్చి పెట్టి వెళ్లిపోయారు. ఇంటి యజమాని వారిని బాలుడు అంకిత్ ఎక్కడా అంటూ నిలదీయడంతో కోదాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. అనంతరం రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేశారు.
అనుమానించిన ఆయన స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారింగా నేరం అంగీకరించారు. పోలీసులు ఖననం చేసిన బాలుడి మృతదేహాన్ని బుధవారం వెలికితీయించారు. అనుమంచిపల్లి గ్రామ వీఆర్వో మజీర్ ఫిర్యాదు మేరకు శ్రీనివాస్, ఉషలపై చిలుకూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగభూషన్‌రావు తెలిపారు.