రహస‍్యంగా ఫోన్‌కాల్స్‌.. ఎన్నిసార్లు చెప్పినా మారని కోడలు.. చివరకు

17 Dec, 2021 11:49 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ నారాయణరెడ్డి

సాక్షి, భువనగిరి(నల్లగొండ): వివాహేతర సంబంధం కొనసాగిస్తుందన్న అనుమానంతో మహిళను భర్త, ఆమె అత్త కలిసి హత్య చేసినట్లు భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి చెప్పారు. హత్య సంఘటనకు సంబందించి వివరాలను గురువారం భువనగిరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. హైదరాబాద్‌లోని మల్లాపూర్‌ సూర్యనగర్‌ కాలనీకి చెందిన కోట ధశరథకు ఇద్దరు భార్యలు ఉన్నారు.

పెద్ద భార్య వెంకటమ్మకు కుమార్తె హేమలత(28)ను దశరథ బావమర్ది అయిన భువనగిరిలోని తాతానగర్‌కు చెందిన దేశగాని చంద్రశేఖర్‌కు ఇచ్చి పది సంవత్సరాల క్రితం వివాహం చేశారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. హేమలత వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నదనే అనుమానంతో చంద్రశేఖర్‌ తరచూ గొడవపడుతుండేవాడు. ఇదే విషయాన్ని చంద్రశేఖర్‌ తన కుటుంబ సభ్యులకు చెప్పాడు.

హేమలత రహస్యంగా ఫోన్‌ వాడుతున్నదని ఆమె అత్తింటివారు నిలదీశారు. ఆమె ప్రవర్తనలో మార్పు రావడం లేదని, తమ పరువు తీస్తుందని భావించి హేమలతను చంపివేయాలని నిర్ణయించుకున్నారు. 

ముగ్గురు కలిసి..
ఈ నెల 13న ప్లాన్‌ ప్రకారం చంద్రశేఖర్‌ భువనగిరి గంజ్‌లోని ఓ దుకాణంలో క్రిమిసంహారక మందు డబ్బాను కొని ఇంటికి వచ్చాడు. అతని బావ రవి హేమలత కాళ్లు చేతులను గట్టిగా పటుకోగా చంద్రశేఖర్‌ తల్లి వెంకటమ్మ క్రిమిసంహారక మందును హేమలత నోట్లో బలవంతంగా పోసింది.  చనిపోయిందోలేదో అనే అనుమానంతో చంద్రశేఖర్‌ హేమలత మేడకు తాడు బిగించి హత్య చేశాడు.

తర్వాత పోలీస్‌ కేసు అవుతుందనే భయంతో ముగ్గురు అక్కడి నుంచి పారిపోయి యాదగిరిగుట్ట పరిసర ప్రాంతంలో తలదాచుకొన్నారు. ఇదే సమయంలో మృతిరాలి తండ్రికి ఫోన్‌ చేసి సమాచారం అందించారు. వెంటనే భువనగిరి చేరుకున్న హేమలత తండ్రి కూతురిని పరిశీలింగా మేడపై గాయలు ఉన్నట్లు అనుమానం రావడంతో చంద్రశేఖర్‌ కుటుంబ సభ్యులను నిలదీశాడు.

హేమలతను తామే హత్యచేసినట్లు చెప్పడంతో దశరథ స్థానిక పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ సుధాకర్‌ కేసు నమోదు చేసుకుని ధర్యాపు ప్రారంభించారు. ఈ నెల 15న నిందితులను ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు.

వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. నిందితుల నుంచి మూడు సెల్‌ ఫోన్లు, తాడు, క్రిమిసంహారక మందు డబ్బాలు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ చెప్పారు. విలేకరుల సమావేశంలో ఇంచార్జి ఏసీపీ నర్సింహ్మరెడ్డి పాల్గొన్నారు. 

చదవండి: నా భార్యను అలా చూసి తట్టుకోలేకపోయా.. అందుకే ఆ పనిచేశా!

మరిన్ని వార్తలు