వివాహేతర సంబంధం: ప్రేమజంట ఆత్మహత్యాయత్నం 

31 Mar, 2021 10:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అడ్డుకున్న పోలీసులు

యువకుడికి రిమ్స్‌లో వైద్య సేవలు   

సాక్షి, కడప : అనంతపురం జిల్లా ఓడీసీ (ఓబుళదేవరచెరువు) మండలానికి చెందిన ఇద్దరు ఇటీవల కొన్ని రోజుల క్రితం కడపకు వచ్చారు. మంగళవారం వారు రిమ్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిసరాల్లో పరస్పరం ఆత్మహత్యాయత్నానికి పాల్పడేందుకు ప్రయత్నించారు. వారి బంధువు, సైనికుడు కశ్మీర్‌ నుంచి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో రిమ్స్‌ సీఐ పి. సత్యబాబు, తమ సిబ్బందితో పాటు, బ్లూకోల్ట్స్‌ సకాలంలో ఘటనా స్థలానికి వెళ్లి ఆత్మహత్యాయత్నంను భగ్నం చేసి ప్రాణాలను రక్షించారు. సీఐ తెలిపిన కథనం మేరకు.. అనంతపురం జిల్లా ఓడీసీకి చెందిన ఖాజాపీర్‌కు భార్య, పిల్లలు ఉన్నారు. ఖాజాపీర్‌కు అదే ప్రాంతానికి చెందిన నఫ్రీన్‌తో పరిచయం ఏర్పడింది. క్రమంగా వీరి బంధం ప్రేమగా మారింది.

ఖాజాపీర్, నఫ్రీన్‌ కడపకు కొన్ని రోజుల క్రితం పరారైవచ్చారు. ఓడీసీలో యువతి అదృశ్యం కేసు నమోదైంది. తమ పెద్దలవద్ద అవమానంగా భావించి, వివాహం చేసుకున్నా బంధువులు వదిలిపెట్టరని పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడాలని నిర్ణయించుకున్నారు. అదే తడవుగా, రిమ్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నగర శివార్లలో పురుగుల మందు చేతపట్టుకుని తమ బంధువైన సైనికుడితో ఫోన్‌లో మాట్లాడారు. అతను నేరుగా రిమ్స్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సెల్‌ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా వారి దగ్గరకు కొన్ని నిమిషాల్లోనే చేరుకున్నారు. అంతలోపే యువకుడు పురుగుల మందు తాగాడు. యువతి కూడా పురుగుల మందు తాగుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఇద్దరినీ రిమ్స్‌లో వైద్య సేవల కోసం చేర్పించారు. ఇద్దరి కుబుంబ సభ్యులు, బంధువులకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.  

చదవండి: పెళ్లి ట్రాక్టర్‌ బోల్తా..ముగ్గురి పరిస్థితి విషమం

మరిన్ని వార్తలు