వివాహేతర సంబంధం: గుంటూరులో చంపి.. మృతదేహం మార్టూరులో వేసి.. 

9 Mar, 2022 21:01 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ఒంగోలు: జిల్లాలోని మార్టూరు వద్ద మూడు రోజుల క్రితం వెలుగుచూసిన హత్యోందంతంలో కిరాయి హంతకుల పాత్ర ఉందని గుర్తించి వారిని అరెస్టు చేసినట్లు ఎస్పీ మలికాగర్గ్‌ తెలిపారు. మంగళవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. ఎస్పీ కథనం ప్రకారం.. ఈ నెల 4వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో మార్టూరు మండలం కోనంకికి చెందిన ఓ రైతు పొలంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఘటన వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని పరిశీలించి అది హత్యగా పోలీసులు నిర్ధారించారు. అయితే మృతుడు ఎవరనేది తెలియరాలేదు. కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని 72 గంటల్లోనే ఛేదించి నిందితులను కటకటాల వెనక్కు నెట్టారు.

 
కేసు వివరాలు మీడియాకు వెల్లడిస్తున్న ఎస్పీ మలికాగర్గ్, పక్కన ఇతర పోలీసు అధికారులు 

ఇదీ..కథ 
మృతుడు గుంటూరు కొత్తపేట మంగళదాస్‌నగర్‌కు చెందిన గోగులపాటి బెన్నీ(41)గా గుర్తించారు. ఆయన సతీమణి బుజ్జికి అన్నం సుబ్బరామయ్య అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ వ్యవహారంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. చంపుతానంటూ పలుమార్లు భార్యను బెన్నీ హెచ్చరించేవాడు. 2021 సెప్టెంబర్‌ 1న భార్యతో గొడవపడి ఆమెను చంపేందుకు యత్నించాడు. కత్తిపోటు పక్కింటి వ్యక్తికి తగిలి అతను మృతి చెందాడు. ఈ కేసులో అతడు జైలుకు వెళ్లి ఇటీవల బెయిల్‌పై తిరిగి వచ్చాడు. సుబ్బరామయ్యకు చెందిన అట్టల పరిశ్రమలో రూ.5 లక్షల విలువైన అట్టలు, ఆటోను తగలబెట్టాడు. ఎప్పటికైనా సుబ్బరామయ్యను చంపుతానని భార్యను అతడు బెదిరించాడు. ఈ విషయాన్ని ఆమె అన్నం సుబ్బరామయ్యకు చెప్పింది. ఇద్దరికీ ప్రాణహాని ఉందని సుబ్బరామయ్య భావించి బెన్నీని అడ్డు తొలగించుకునేందుకు పథక రచన చేశాడు.

గుంటూరు వెంకటప్పయ్య కాలనీకి చెందిన చల్లా గోపీతో లక్ష రూపాయలకు బెన్నీని హత్య చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. సుబ్బరామయ్య, గోపీ, గుంటూరు సంగడిగుంటకు చెందిన దొడ్డి వెంకట ప్రసాద్, సాయిబాబా కాలనీకి చెందిన ఇక్కుర్తి ఓంకార్, మంగళదాస్‌ నగర్‌కు చెందిన గోగులపాటి బుజ్జి, నల్లచెరువుకు చెందిన దుగ్గిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మరో మైనర్‌ బాలుడు కలిసి ముందుగా ఒక కారును అద్దెకు తీసుకున్నారు. కారులో బెన్నీ ఇంటికి వెళ్లి కత్తితో పొడిచి, ఇనుప రాడ్‌తో విచక్షణారహితంగా కొట్టి ముఖంపై దిండు ఉంచి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని కారులో వేసుకుని కోలలపూడి రోడ్‌లో కోనంకి సమీపంలో పడేసి వెళ్లిపోయారు.  

ముఠాగా ఏర్పడిన నిందులు 
పోలీసులు అరెస్టు చేసిన వారిలో దొడ్డి వెంకట ప్రసాద్‌ అలియాస్‌ ప్రసాద్‌ గతంలో దొంగతనాలు, దోపిడీ, హత్యలు, కిడ్నాప్‌ కేసుల్లో నిందితుడు. లాలాపేట పోలీసుస్టేషన్‌ పరిధిలో హిస్టరీ షీట్‌ కూడా ఉంది. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి కిరాయి హత్యకు పాల్పడ్డారు. హత్యకు ఉపయోగించిన టవేరా కారు, ఇరన్‌రాడ్, కత్తి, పది ఫోన్లు, రూ.21 వేల నగదును పోలీసులు సీజ్‌ చేశారు. కేసును ఛేదించడంలో కృషి చేసిన చీరాల డీఎస్పీ శ్రీకాంత్, ఇంకొల్లు సీఐ సుబ్బారావు, మార్టూరు, ఇంకొల్లు, జె.పంగులూరు ఎస్‌ఐలు ఎస్‌వీ రవీంద్రారెడ్డి, ఎన్‌సీ ప్రసాద్, పున్నారావు, ఫింగర్‌ ప్రింట్స్‌ బ్యూరో ఎస్‌ఐ పి.శరత్‌బాబు, హెడ్‌ కానిస్టేబుళ్లు కోటేశ్వరరావు, జి.సుధాకరరావు, జి.పాపారావు, కానిస్టేబుళ్లు కె.శ్రీను, కె.అనీల్‌కుమార్, సీహెచ్‌ రత్నరాజు, బీవీ రమణ, బి.అవినాష్, ఎస్‌కే మొహ్మద్‌ రఫీ, హోంగార్డులు ఎం.ప్రభాకర్, టి.నాగరాజులను ప్రశంసపత్రాలు, రివార్డులతో ఎస్పీ మలికాగర్గ్‌ అభినందించారు. 

మరిన్ని వార్తలు