Extramarital Affair: మహిళతో వివాహేతర సంబంధం.. నీ భర్తకు చెప్పేస్తా.. చివరికి షాకింగ్‌ ట్విస్ట్‌

26 Jun, 2022 18:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సబ్బవరం (పెందుర్తి): సబ్బవరం శివారు గొల్లలపాలెంలో జరిగిన యువకుడి హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. డబ్బుల కోసం వేధించడంతోపాటు తమ మధ్య గతంలో ఉన్న వివాహేతర సంబంధాన్ని తన భర్తకు చెప్పేస్తానని బెదిరిస్తున్న యువకుడిని... ప్రస్తుతం తనతో సన్నిహితంగా ఉంటున్న మరో వ్యక్తితో హత్య చేయించింది ఓ మహిళ. ఇందుకు సంబంధించిన వివరాలను సబ్బవరం పోలీస్‌ స్టేషన్‌లో అనకాపల్లి డీఎస్పీ సునీల్‌ మీడియాకు శనివారం వెల్లడించారు. సబ్బవరం ప్రాంతానికి చెందిన సింహాచలం ఆరేళ్ల కిందట నగరంలోని ఎన్‌ఏడీ కొత్త రోడ్డు ప్రాంతంలో ఓ కేబుల్‌ ఆపరేటర్‌ వద్ద పని చేసేవాడు.
చదవండి: నమ్మి ఆ ఫోటోలు, వీడియోలు పంపిన యువతి.. చివరికి ఏం జరిగిందంటే?

ఆ సమయంలో అక్కడ ఓ మహిళతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. కొన్నాళ్ల తర్వాత అక్కడ పని మానేసి స్వస్థలానికి వచ్చేసిన సింహాచలం... వివాహితతో ఉన్న సాన్నిహిత్యంతో ఆమె బంగారు ఆభరణాలు తీసుకొచ్చి తాకట్టు పెట్టాడు. కొద్ది రోజుల తర్వాత ఆమె బంగారు ఆభరణాలు అడగడంతో తాకట్టులో ఉన్నాయని... డబ్బులు ఇస్తే విడిపించి తీసుకొస్తానని నమ్మించాడు. అలా పలుమార్లు డబ్బులు తీసుకున్నాడు. పేకాట, బెట్టింగ్‌లకు పాల్పడే సింహాచలం తనకు డబ్బులు అవసరమైనప్పుడల్లా ఆమెను బెదిరించి తీసుకునేవాడు.

డబ్బులు ఇవ్వకుంటే తమ మధ్య ఉన్న సంబంధాన్ని ఆమె భర్తకు చెప్పేస్తానని బెదిరించేవాడు. సింహాచలం తీరుతో విసిగిపోయిన సదరు మహిళ అడ్డు తొలగించుకోవాలని భావించింది. తనతో సన్నిహితంగా ఉంటున్న నగరంలోని అల్లిపురం ప్రాంతానికి చెందిన గుడివాడ గోవింద్‌కు జరిగిన విషయం అంతా చెప్పింది. డబ్బుల కోసం వేధిస్తున్నాడని, వివాహేతర సంబంధం విషయాన్ని తన భర్తకు చెబుతానని బెదిరిస్తున్నాడని, ఎలాగైనా సింహాచలాన్ని హతమార్చేయాలని కోరింది.

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిగా పరిచయం చేసుకుని...  
సదరు వివాహితకు ఇచ్చిన మాట ప్రకారం సింహాచలాన్ని హతమార్చేందుకు గోవింద్‌ సిద్ధమయ్యాడు. ప్రణాళికలో భాగంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిగా సింహాచలానికి పరిచయం చేసుకున్నాడు. కొద్ది రోజులు గడిచాక ఈ నెల 19న రాత్రి 8 గంటల సమయంలో నగరం నుంచి గోవింద్‌ కారులో సబ్బవరం వచ్చాడు. సింహాచలాన్ని పిలిపించుకుని గొల్లలపాలెం శివారుకు తీసుకెళ్లి ఇద్దరూ మద్యం తాగారు. ప్రణాళికలో భాగంగా తనతో తీసుకొచ్చిన కత్తితో సింహాచలం గొంతుపై గోవింద్‌ కోసేశాడు. వెంటనే భయంతో సింహాచలం పరుగు తీయగా వెనుక నుంచి ఇనుప వస్తువుతో తలపై బలంగా కొట్టాడు.

చనిపోయాడని నిర్ధారించుకున్నాక అక్కడి నుంచి నగరంలోకి గోవింద్‌ వెళ్లిపోయాడు. మరుసటి రోజు 20న ఉదయం సింహాచలం మృతదేహం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు భిన్న కోణాల్లో కేసు దర్యాప్తు చేపట్టారు. మృతునికి పేకాట, బెట్టింగ్‌ ముఠాలతో సంబంధాలు ఉండడంతో ఆ దిశగా ముందుగా కేసు దర్యాప్తు చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో సాంకేతిక ఆధారాలు, కాల్‌ డేటా, సీసీ కెమెరా పుటేజీ సాయంతో విచారణ చేపట్టి నిందితులను గుర్తించారు.

అల్లిపురం ప్రాంతానికి చెందిన గోవింద్‌ విజయవాడ నుంచి విశాఖకు వస్తుండగా చిన్నయ్యపాలెం వద్ద శుక్రవారం అరెస్ట్‌ చేశారు. ఈ హత్యకు ప్రోత్సహించిన సదరు మహిళను కూడా అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. మృతుడు సింహాచలం సదరు మహిళతోపాటు ఆమె చెల్లెలు, మరికొంత మంది మహిళలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వారి వద్ద కూడా డబ్బులు తీసుకున్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. ఐదు రోజులపాటు తీవ్రంగా శ్రమించి నిందితులను పట్టుకున్న సీఐ చంద్రశేఖరరావుతోపాటు ఎస్‌ఐ ఎల్‌.సురేష్‌ను డీఎస్పీ అభినందించారు. మరోవైపు హత్యకు పాల్పడిన వ్యక్తిని తమకు చూపించలేదని మృతుని కుటుంబ సభ్యులు కొంత సేపు పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆందోళన చేపట్టారు. మృతుని భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. పోలీస్‌ అధికారులు సర్దిచెప్పడంతో శాంతించారు.   

మరిన్ని వార్తలు