ఓఎల్‌ఎక్స్‌ టు ఫేస్‌బుక్‌! 

12 Sep, 2020 08:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సామాన్య ప్రజలతో పాటు ఏకంగా పోలీసు అధికారులకు చెందిన ఫేస్‌బుక్‌ ప్రొఫైల్స్‌ను కాపీ చేసి, నకిలీవి సృష్టించి డబ్బు డిమాండ్‌ చేస్తున్న ముఠాలు రాజస్థాన్‌కు చెందినవిగా సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. వివిధ ఈ–వాలెట్స్‌ ద్వారా డబ్బు పంపాలంటూ ఆయా నేరగాళ్లు ఫేస్‌బుక్‌ చాటింగ్‌లో ఇచ్చిన సెల్‌ఫోన్‌ నంబర్లను విశ్లేషించడంతో పాటు వాటి లొకేషన్స్‌ను అధ్యయనం చేసిన అధికారులు ఈ విషయం తేల్చారు. ఒకప్పుడు ఈ–యాడ్స్‌ యాప్‌ ఓఎల్‌ఎక్స్‌ ద్వారా సెకండ్‌ హ్యాండ్‌ వాహనాలు, వస్తువుల విక్రయం/ఖరీదు పేరుతో నేరాలకు పాల్పడిన వారే ఇప్పుడు ఈ ఫేస్‌బుక్‌ క్రైమ్‌కు తెగబడుతున్నట్లు నిర్ధారించారు. వీరి ఆచూకీ గుర్తించినా పట్టుకోవడం దుర్లభం అని పోలీసులు చెబుతున్నారు. ఆర్మీ ఉద్యోగులుగా  పేర్కొంటూ తక్కువ ధరకు వాహనాలు, వస్తువుల పేరుతో యాడ్స్‌ యాప్‌లో పోస్టులు పెట్టి మోసం చేసే ఓఎల్‌ఎక్స్‌ ఫ్రాడ్స్‌పై ప్రజల్లో కొంత మేర అవగాహన రావడంతో రాజస్థాన్‌ గ్యాంగ్స్‌ ఈ కొత్త నేరానికి తెరలేపినట్లు అనుమానిస్తున్నారు.

ఈ  నేరగాళ్లకు రాజస్థాన్‌లోని మేవాట్‌ రీజియన్‌లో ఉన్న ఆల్వార్, భరత్‌పూర్, ఉన్నవ్‌ అడ్డాలు.  అక్కడ ఉండే యువత వ్యవస్థీకృతంగా ఈ దందాలు చేస్తుంటారు. ప్రధానంగా దక్షిణాది పైనే కన్నేస్తున్న ఈ కేటుగాళ్లపై దేశ వ్యాప్తంగా వేల కేసులు ఉంటున్నాయి. అయితే ఎవరైనా భరత్‌పూర్‌ వెళ్లి వారికి పట్టుకోవాలని భావిస్తే మాత్రం తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురవుతున్నది. గ్రామం అంతా కలిసి విచక్షణారహితంగా పోలీసులపై దాడులకు పాల్పడుతుంటారు. ఈ నకిలీ ఫేస్‌బుక్‌ ఫ్రాడ్‌ రోజు రోజుకూ పెరుగుతోంది. సాధారణ ప్రజలతో పాటు పోలీసుల అధికారుల పేరుతోనూ వీటిని ఓపెన్‌ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇటీవల అనేక మంది అధికారులు తమ ఫేల్‌బుక్‌ వాల్స్‌లో తనకు ఈ ఒక్క ఖాతానే ఉందని, తన ప్రొఫైల్‌తో ఎవరైనా డబ్బు డిమాండ్‌ చేస్తే నమ్మవద్దని కోరుతున్నారు. మరికొందరు అధికారులైతే ఏకంగా తన ఫేస్‌బుక్‌ ఖాతాలనే క్లోజ్‌ చేసుకుంటున్నారు. ఈ నేరగాళ్ల విషయంలో అంతా అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కోరుతున్నారు. వ్యక్తిగతంగా లేదా ఫోన్‌లో సంప్రదించనిదే ఎవరూ ఆర్థిక లావాదేవీలు చేయవద్దని స్పష్టం చేస్తున్నారు. 

ఈఎంఐల వాయిదా అంటూ టోకరా... 
కరోన విజృంభణ, లాక్‌డౌన్‌ ప్రభావాలతో వివిధ రుణాలకు సంబంధించిన ఈఎంఐలపై గతంలో కేంద్ర ప్రభుత్వం మూడు నెలల మారిటోరియం విధించింది. ఈ మారిటోరియం సమయంలో వడ్డీ తదితర అంశాలపై ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం మారిటోరియంను పెంచే ప్రతిపాదనలు ఉన్నాయంటూ కోర్టుకు తెలిపింది. దీన్ని క్యాష్‌ చేసుకోవడానికీ సైబర్‌ నేరగాళ్లు రంగంలోకి దిగారు.

ఈఎంఐల మారిపోరియం పొడిగింపు పేరుతో ఆయా బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థల ప్రతినిధులుగా ఫోన్లు చేస్తున్నారు. బాధితుల నుంచి బ్యాంకు ఖాతాలు, డెబిట్‌/క్రెడిట్‌ కార్డుల వివరాలు, ఓటీపీలు తెలుసుకుని అందినకాడికి దండుకుంటున్నారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ నగర కొత్వాల్‌ అంజనీకుమార్‌ శుక్రవారం ట్వీట్‌ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీ వంటి వ్యక్తిగత వివరాలు ఎవరికీ చెప్పవద్దని సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు