ఫేస్‌బుక్‌: ‘లాక్‌’ చేసినా రిక్వెస్ట్‌లు 

23 Feb, 2021 09:00 IST|Sakshi

నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా నేరగాళ్ల కొత్త పంథా 

తమ ప్రొఫైల్స్‌ లాక్‌ చేసుకుంటున్న నెటిజనులు 

వారికి యువతుల ఫొటోలతో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు 

అంగీకరించిన వారి స్నేహితుల జాబితా ద్వారా అసలు కథలు 

సాక్షి, హైదరాబాద్‌: ఫేస్‌బుక్‌ వినియోగదారుల ఫొటోలు, పేర్లు వినియోగించి కొత్త ఖాతాలు తెరిచి, స్నేహితుల జాబితాలోని వారికి ఫ్రెండ్‌ రిక్వెస్టులు పంపి, డబ్బు డిమాండ్‌ చేసే సైబర్‌ నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. వీరి బారిన పడకుండా ప్రొఫైల్స్‌ లాక్‌ చేసుకుంటే... వారికి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపి బుట్టలో పడేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ తరహా ఫిర్యాదులు పెరిగాయని సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ “సాక్షి’కి తెలిపారు.  

ఖాతాల వివరాలు సెర్చ్‌ చేసి అనువైనవి గుర్తించి..
ఈ తరహా నేరాలు చేస్తున్న నేరగాళ్లు ప్రాథమికంగా ఫేస్‌బుక్‌లోకి ప్రవేశిస్తున్నారు. వీలైనన్ని ఖాతాల వివరాలు సెర్చ్‌ చేసి అనువైనవి గుర్తిస్తున్నారు. ఆయా ఖాతాల్లో ఉన్న ఫొటోలను డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. ఆపై ఆ ప్రొఫైల్‌ నేమ్‌లు, డౌన్‌లోడ్‌ చేసిన ఫొటోలను వినియోగించి నకిలీ ఖాతాలు సృష్టిస్తున్నారు.  ఈ కొత్త ఖాతాల నుంచి ఫ్రెండ్స్‌ లిస్టులో ఉన్న వారికే మళ్లీ ఫ్రెండ్‌ రిక్వెస్టులు పంపిస్తున్నారు. వీటిని చూసిన ఎదుటి వ్యక్తులు తమ పరిచయస్తులే అనివార్య కారణాలతో మరో ఖాతా తెరిచి ఉంటారని భావించి యాక్సెప్ట్‌ చేస్తున్నారు. ఆ నకిలీ ఖాతాలు వినియోగించి కొన్నాళ్లు చాటింగ్‌ చేస్తున్నారు.

ఆ తర్వాత సైబర్‌ నేరగాళ్లు అసలు కథ ప్రారంభిస్తున్నారు. తమకు అత్యవసరం ఉందంటూ ఈ నకిలీ ఖాతాల నుంచి అసలు వ్యక్తుల ఫ్రెండ్స్‌కు సందేశం పంపిస్తున్నారు. రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పంపాలని, కొన్ని గంటల్లోనే తిరిగి ఇచ్చేస్తానంటూ ఈ–వాలెట్స్‌లోని బదిలీ చేయించుకుంటున్నారు. ఈ సైబర్‌ నేరాలపై కొంత వరకు అవగాహన పెరగడంతో అనేక మంది తమ ప్రొఫైల్స్‌ను లాక్‌ చేసుకుంటున్నారు. ఇలా చేసుకోవడంతో సైబర్‌ క్రిమినల్స్‌ వారి ఫొటోలు, పేర్లు కాపీ చేస్తున్నా... ఫ్రెండ్స్‌ లిస్టు చూడలేకపోవడంతో కొత్త రిక్వెస్ట్‌లు, చాటింగ్స్, డబ్బు డిమాండ్‌ సాధ్యం కావట్లేదు. 

దీంతో నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తూ ఇంటర్‌నెట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసిన అందమైన యువతుల ఫొటోలతో ప్రొఫైల్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు. వీటి ద్వారా టార్గెట్‌ చేసిన వారికి రిక్వెస్ట్‌లు పంపుతున్నారు. వారు యాక్సెప్ట్‌ చేస్తే ‘స్నేహితులుగా’ మారిపోతున్నారు. ఆపై వీరికి వాళ్ల ఫ్రెండ్స్‌ లిస్టులు కూడా చూడటం సాధ్యమవుతోంది. ఆపై పాత కథే మొదలెట్టి డబ్బు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ తరహా సైబర్‌ నేరగాళ్ల వద్ద బాధితులుగా మారకుండా ఉండటానికి కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రొఫైల్స్‌ లాక్‌ చేసుకోవడంతో పాటు అపరిచిత ఫ్రెండ్స్‌ రిక్వెస్ట్‌లు అంగీకరించ వద్దని సూచిస్తున్నారు.

చదవండి: ధాబాకు వెళ్లి.. వెంటనే వచ్చేస్తామని చెప్పి
తస్మాత్‌ జాగ్రత్త: స్కూటీ ఇచ్చాడు ఏ-1 గా జైలుకెళ్లాడు

మరిన్ని వార్తలు