ఖతార్‌ నుంచి హతమార్చేందుకు ప్లాన్‌.. చంపేందుకు వెళ్తూ..

30 Oct, 2022 09:37 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గుంటూరు రూరల్‌: వాళ్లిద్దరూ చిన్నప్పటి నుంచీ ప్రాణ స్నేహితులు. బాగా చదువుకుని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఆ తరువాత ఇద్దరిమధ్యా తలెత్తిన ఆర్థిక లావాదేవీలు దూరం పెంచాయి. చివరకు కిరాయి హంతకుల సాయంతో మిత్రుడునే హత్య చేయించే స్థాయికి పురిగొల్పాయి. చివరకు పన్నాగం బెడిసికొట్టడంతో నిందితులు పోలీసులకు చిక్కారు. గుంటూరు జిల్లా నల్లపాడు సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు మండలం ఏటీ అగ్రహారానికి చెందిన ప్రశాంత్, అవినాష్‌రెడ్డి చిన్ననాటి నుంచి స్నేహితులు.
చదవండి: ఒకే మహిళతో ఇద్దరు వివాహేతర సంబంధం.. మర్మాంగాలను కోసి..

ప్రశాంత్‌ ఖతార్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తుండగా.. అవినాష్‌రెడ్డి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ రంగంలోనే స్థిరపడ్డారు. కాగా, అవినాష్‌రెడ్డికి ప్రశాంత్‌ తన సొంత ఖర్చుతో పెళ్లి చేశాడు. అనంతరం ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదాలు ఏర్పడ్డాయి. అవినాష్‌రెడ్డి వైఖరిపై విసుగు చెందిన ప్రశాంత్‌ అతడిని అంతం చేయాలని పథకం పన్నాడు. తాను ఖతార్‌లో నుంచి గుంటూరు సుందరయ్య కాలనీకి చెందిన నామాల చందు, దేవళ్ల సూర్య, రాచకొండ గోపీకృష్ణ, వెంగలశెట్టి దుర్గాప్రసాద్, షేక్‌ కరీముల్లా, షేక్‌ బాజీ, పూసల బాలాజీ, కమతం కృష్ణను సంప్రదించాడు. అవినాష్‌రెడ్డిని హతమార్చాలని, ఇందుకోసం ఎంత ఖర్చయినా భరిస్తానని చెప్పాడు. సుమారు రూ.30 లక్షల వరకు సుపారీ చెల్లించాడు.

చంపేందుకు వెళ్తూ దొరికిపోయారు 
సుపారీ తీసుకున్న 8 మంది ఇటీవల విజయవాడలో కత్తులు కొనుగోలు చేసి తెచ్చుకున్నారు. కాగా, నిందితులకు స్థానికంగా కొందరితో వివాదాలు ఉండటంతో.. హైదరాబాద్‌లో హత్య చేసి తిరిగొచ్చాక ఇక్కడి వారి సంగతి తేలుస్తామని హెచ్చరించారు. అనంతరం శుక్రవారం రాత్రి వారంతా కారులో హైదరాబాద్‌ బయలుదేరగా.. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న నల్లపాడు పోలీసులు పేరేచర్ల వద్ద 8 మందినీ అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి కత్తులు, ఇతర మారణాయుధాలు, కారును స్వాధీనం చేసుకున్నారు. స్నేహితుడి హత్యకు పథకం వేసిన ప్రశాంత్‌ను ఖతార్‌ నుంచి స్వగ్రామానికి రప్పించేందుకు చర్యలు చేపట్టారు.  

మరిన్ని వార్తలు