తపంచాతో బెదిరించి దోపిడీకి యత్నం..

23 Aug, 2022 09:32 IST|Sakshi

రాజేంద్రనగర్‌/మైలార్‌దేవ్‌పల్లి: జువెలరీ, పాన్‌ బ్రోకర్‌ దుకాణంలోకి చొరబడిన ముగ్గురు యువకులు తపాంచాతో బెదిరించి దోపిడికి యత్నించారు. ఈ సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. దుకాణం యజమాని తోటి వ్యాపారుల సహాయం కోరడంతో  స్థానిక వ్యాపారులు ఇద్దరినీ పట్టుకొని దేహశుద్ధి చేశారు. మరో నిందితుడు పరారయ్యాడు.  

ఇద్దరు నిందితులతో పాటు తపాంచాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మధుబన్‌ కాలనీలో  దిలీప్, దినేష్‌లు సరస్వతీ జూవెలరీ, పాన్‌ బ్రోకర్‌ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు.  సోమవారం సాయంత్రం  దిలీప్‌ దుకాణంలో ఉండగా ముగ్గురు యువకులు ఆభరణాలు చూపించాలని కోరడంతో దిలీప్‌ చూపించేందుకు ప్రయత్నించాడు. రాజస్థాన్‌ భాషలో మాట్లాడుతుండడంతో రాజస్థాన్‌కే చెందిన దిలీప్‌ అప్రమత్తమైయ్యాడు. దిలీప్‌ సైతం రాజస్థాన్‌ భాషలో మాట్లాడుతుండగా నిందితుల్లో దినేష్‌ తపంచాతో బెదిరిస్తు దిలీప్‌ నుదుడిపై దాడి చేశాడు.

దిలీప్‌ గట్టిగా నిందితుడు దినేష్‌ను పట్టుకోని కిందపడేయడంతో ఒక పక్క తపాంచా పడడం, మరో పక్క దినేష్‌ పడడంతో వెంట వచ్చిన మరో ఇద్దరు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దిలీప్‌ బచావ్‌ బచావ్‌ అని అరవడంతో పక్కనే ఉన్న స్వీటు షాపు యజమాని, కిరాణదుకాణం యజమానులు అప్రమత్తమై లోపలికి వస్తుండడంతో నిందితుల్లో ఒకరు తపాంచా చూపిస్తు తాను వచ్చిన ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు.

మరో యువకుడు పరిగెత్తేందుకు ప్రయత్నించగా స్వీటు షాపు యజమాని పట్టుకొని చితకబాదారు. దినేష్ పాటు మరో యువకుడు పట్టుబడడంతో స్థానికులు పట్టుకోని దేహశుద్ధి చేశారు.  పోలీసులు నిందితుడు దినేష్ తోపాటు మరో యువకుడిని అదుపులోకి తీసుకోని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలంలో ఒక రౌండ్‌తో పాటు తపాంచాను స్వాదీనం చేసుకున్నారు. 

(చదవండి: నేటి నుంచి తెలుగు భాషా అమృతోత్సవాలు )

మరిన్ని వార్తలు