రాజస్థాన్‌ నుంచి వచ్చిన బురిడి బాబాలు.. దోష నివారణ పూజలు చేస్తామని

6 Jul, 2022 09:46 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌: దోష నివారణ పూజలు చేస్తామని  నమ్మించి హవాలా రూపంలో డబ్బులు కాజేస్తున్న దొంగ బాబాల అటకట్టించారు రాచకొండ పోలీసులు. 11 మంది సభ్యులు గల అంతర్రాష్ట్ర ముఠాలో ఏడుగురిని అరెస్ట్‌ చేశారు. భువనగిరి జోన్‌ డీసీపీ కే నారాయణ రెడ్డితో కలిసి రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ మంగళవారం వివరాలు వెల్లడించారు. 

రాజస్థాన్‌కు చెందిన సంజునాథ్, ఘోరఖ్‌నాథ్, రామ్‌నాథ్, జొన్నత్, గోవింద్‌ నాథ్, అర్జున్‌నాథ్‌ సాధువుల వేషంలో అమాయకులను బురిడీ కొట్టిస్తుంటారు. బాధితుల నుంచి వసూలు చేసిన సొమ్మును హవాలా రూపంలో మళ్లించేందుకు రాజస్థాన్, హైదరాబాద్‌లోని హవాలా ఏజెంట్లు పునరం, వస్నా రామ్, ప్రకాశ్‌ జోటా, ప్రకాష్‌ ప్రజాపతి అలియాస్‌ మామాజీ, రమేష్‌ ప్రజాపతి పనిచేస్తుంటారు.  


పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువులు

ఈ క్రమంలో 2020 నవంబర్‌ 29న యాదాద్రి జిల్లా, రామకృష్ణాపురానికి చెందిన ట్రాన్స్‌పోర్ట్‌ వ్యాపారి కొండల్‌ రెడ్డి పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా అతడి ద్విచక్ర వాహనం ముందు నుంచి పాము వెళ్లింది. దీంతో బ్యాలెన్స్‌ తప్పి కిందపడటంతో గాయపడ్డాడు. అదే ఏడాది డిసెంబర్‌ 6న తన ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసులో ఉండగా.. రాజస్థాన్‌కు చెందిన సంజునాథ్, ఘోరఖ్‌నాథ్‌ సాధువు వేషంలో భిక్ష కోసం వెళ్లారు. కొండల్‌ రెడ్డి ఒంటిపై గాయాలను చూసిన వారు ఏమైందని ప్రశ్నించగా.. జరిగిన విషయం కొండల్‌ రెడ్డి వారికి వివరించాడు.

కొండల్‌ రెడ్డి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న వారు  నీకు సర్పదోషం ఉందని, దోష నివారణకు పూజలు చేయాలని సూచించారు. లేని పక్షంలో నీతో పాటు నీ కుటుంబానికి ప్రాణహాని తప్పదని బెదిరించారు. దీంతో దోష నివారణ పూజకు అంగీకరించిన కొండల్‌ రెడ్డి.. పూజా సామగ్రి కోసం రూ.41 వేలు చెల్లించాడు.  
∙సంజునాథ్, ఘోరఖ్‌నాథ్‌ సూచన మేరకు రాజస్థాన్‌ షిరోహీ జిల్లాకు చెందిన రామ్‌నాథ్, జొన్నత్, గోవింద్‌నాథ్, అర్జున్‌నాథ్‌లు కొండల్‌ రెడ్డి ఇంటికి వెళ్లి క్షుద్ర పూజలు చేశారు. ఆ తర్వాత రాజస్థాన్‌కు వెళ్లిపోయిన వీరు తరచూ ఫోన్‌లో కొండల్‌ రెడ్డి బెదిరించసాగారు. అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఇంట్లో నాగ దేవత ప్రతిష్ట చేసుకోవాలని చెప్పి.. పలు దఫాలుగా రూ.37.71 లక్షలు సొమ్ము కాజేశారు.

ఇలా పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకున్న కొండల్‌ రెడ్డి రాచకొండ పోలీసులను ఆశ్రయించాడు. తాజాగా మరోమారు డబ్బులు తీసుకొని ఘట్‌కేసర్‌కు రావాలని నిందితులు సూచించగా.. భువనగిరి స్పెషల్‌ ఆపరేషన్‌ టీం (ఎస్‌ఓటీ), భువనగిరి టౌన్‌ పోలీసులు పక్కా వ్యూహంతో నిందితులు రామ్‌నాథ్, జొన్నత్, గోవింద్‌నాథ్, అర్జున్‌నాథ్, పునరం, వస్నారామ్, ప్రకాశ్‌ జోటాలను పట్టుకున్నారు. సంజునాథ్, ఘోరఖ్‌నాథ్, ప్రకాశ్‌ ప్రజాపతి, రమేష్‌ ప్రజాపతి పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రూ.8.30 లక్షల నగదు, 12 సెల్‌ఫోన్లు, రుద్రాక్షమాల, కమండలం, అఘోరా దండలు, డబ్బు లెక్కించే యంత్రం ఇతరత్రా వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.  

తమిళనాడు, బెంగళూరులోనూ.. 
వీరు ఇప్పటికే నగరంలో రెండు మూడు చోట్ల ఈ తరహా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. వీరు తమిళనాడు, బెంగళూరు తదితర ప్రాంతాల్లోనూ క్షుద్ర పూజల పేరిట పెద్ద మొత్తంలో సొమ్ము కొట్టేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న నలుగురు నిందితుల కోసం ప్రత్యేక బృందం రాజస్థాన్‌లోని షిరోహీకి వెళ్లిందని త్వరలోనే వారిని పట్టుకుంటామని తెలిపారు. 

మరిన్ని వార్తలు