హైదరాబాద్‌ నుంచే కేన్సర్‌ నకిలీ మందులు! 

25 Oct, 2021 01:15 IST|Sakshi

అక్రమంగా దిగుమతి చేసుకుంటున్న రాఘవేంద్రరెడ్డి 

ఇక్కడ నుంచి ముంబై సహా వివిధ ప్రాంతాలకు సరఫరా 

ఈ నెల మొదటి వారంలో గుట్టురట్టు చేసిన అక్కడి 

ఈఓడబ్ల్యూ కళ్యాణ్‌ వాసి పూజ రాణా 

అరెస్టుతో వ్యవహారం వెలుగులోకి.. 

నగరంలోనూ ఈ తరహా మందుల విక్రయంపై అనుమానాలు

సాక్షి, హైదరాబాద్‌: ముంబైలోని కళ్యాణ్‌ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన కేన్సర్‌ నకిలీ మందుల తీగ లాగితే హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి డొంక కదిలింది.  వీటిని విదేశాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకుని సరఫరా చేస్తున్నట్లు తేలింది. దీంతో ముంబై ఎకనమికల్‌ ఆఫెన్సెస్‌ వింగ్‌ (ఈఓడబ్ల్యూ) అధికారులు గత వారం వ్యాపారి రాఘవేంద్రరెడ్డిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఉన్నత విద్య అభ్యసించిన ఇతను హైదరాబాద్‌ కేంద్రంగా మూడు ఫార్మా సంస్థలను నిర్వహిస్తుండటంతో ఇక్కడా ఆ నకిలీ మందుల విక్రయాలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నగరానికి చెందిన రాఘవేంద్రరెడ్డి చెన్నైలోని ఐఐటీ నుంచి బీటెక్, అహ్మదాబాద్‌లోని ఐఐఎం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. కొన్నాళ్లు లండన్‌లోని ఓ ప్రముఖ కంపెనీలో పని చేసి ఆపై హైదరాబాద్‌కు వచ్చేశారు. ఫార్మా రంగంలో అడుగుపెట్టి.. ఓ సంస్థను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మూడు ఫార్మా సంస్థలను నిర్వహిస్తున్నారు. వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా రష్యా, చైనా, ఈజిప్ట్, టర్కీకి వెళ్లి వచ్చారు. టర్కీకి చెందిన ఓ సంస్థ ప్రతినిధులు ఇతడిని ముగ్గులోకి దింపాయి. కేన్సర్‌ చికిత్సలో వాడే యాడ్‌సెట్రస్‌ ఇంజెక్షన్, ఐక్లూజిగ్‌ టాబ్లెట్లను జపాన్‌కు చెందిన కంపెనీ తయారు చేస్తుంటుంది. అదే ఫార్ములాతో ఔషధాలను తాము తయారు చేసి తక్కువ ధరకు విక్రయిస్తామని చెప్పారు. 

అనుమతి లేకున్నా దిగుమతి.. 
జపాన్‌ కంపెనీ సరఫరా చేసే ఇంజెక్షన్‌ ధర రూ.5.8 లక్షలు ఉండగా.. తాము రూ.1.1 లక్షలకే ఇస్తామని, ట్యాబ్లెట్లు కూడా అతి తక్కువ ధరకు సరఫరా చేస్తామని టర్కీ కంపెనీ చెప్పడంతో రాఘవేంద్రరెడ్డి అంగీకరించారు. ఇతడి సంస్థల్లో దేనికీ ఎగుమతి–దిగుమతుల లైసెన్స్‌ లేదు. అయినా వాటిని దిగుమతి చేసుకుంటున్నారు. ఇలా వచ్చిన వాటిని వివిధ నగరాల్లోని ఔషధ దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. ముంబైలోని కళ్యాణ్‌ ప్రాంతానికి చెందిన పూజ రాణా అక్కడి శాంతక్రుజ్‌లో ప్రైమ్‌ ఫార్మా పేరుతో ఓ దుకాణం నిర్వహిస్తున్నారు.

ఈమెకు రాఘవేంద్రరెడ్డి టర్కీ నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న ఔషధాలు పంపుతున్నారు. ఆమె వద్ద తక్కువ ధరకు కేన్సర్‌ మందులు లభిస్తున్నాయని ప్రచారం జరిగింది. ఈ విషయం జపాన్‌ సంస్థకు తెలియడంతో వాళ్లు ముంబైకి చెందిన ఓ సంస్థను సంప్రదించారు. తమ ఉత్పత్తుల పేరుతో కొన్ని నకిలీవి మార్కెట్‌లో ఉన్నాయని, వాటిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధీకృత అధికారాలు ఇచ్చారు. దీంతో ఆ సంస్థ సెప్టెంబర్‌ చివరి వారంలో ముంబై ఈఓడబ్ల్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.  

కొనుగోలుదారుల మాదిరిగా... 
నేరుగా వెళ్లి దాడి చేస్తే ఆధారాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు.. ఈ నెల 1న కొనుగోలుదారుల మాదిరిగా ప్రైమ్‌ ఫార్మాకు వెళ్లారు. టర్కీ నుంచి వచ్చిన ఔషధాలను ఖరీదు చేసి, బిల్లు తీసుకుని పూజను అరెస్టు చేశారు. ఈమె వద్ద భారీ మొత్తంలో లభించిన కేన్సర్‌ ఔషధాలు నకిలీవిగా తేల్చారు. వీటిని హైదరాబాద్‌కు చెందిన రాఘవేంద్రరెడ్డి సరఫరా చేస్తున్నారని విచారణలో వెల్లడైంది. దీంతో గత వారం ఇక్కడకు వచ్చిన స్పెషల్‌ టీమ్‌ ఆయన్ను అరెస్టు చేసి తీసుకువెళ్లింది. ముంబై న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించింది.

ఈఓడబ్ల్యూ పోలీసులు ఈ కేసును కాపీ రైట్‌ యాక్ట్, డ్రగ్స్‌ అండ్‌ కాస్పోటిక్స్‌ యాక్ట్‌లోని సెక్షన్ల కిందే నమోదు చేశారు. అయితే, తన వ్యాపారంపై ఎలాంటి ఆధారాలు చిక్కండా  ఉండటానికి రాఘవేంద్రరెడ్డి తన సెల్‌ఫోన్‌ ధ్వంసం చేశారు. దీంతో ఆధారాల మాయం చేయడానికి ప్రయత్నించాడని.. ఆ సెక్షన్‌ను జోడించారు. హైదరాబాద్‌లోనూ ఈ మందులు సరఫరా చేసి ఉంటారని ఈఓడబ్ల్యూ అధికారులు అనుమానిస్తున్నారు. తదుపరి విచారణ పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి తెలంగాణ పోలీసులు, ఔషధ నియంత్రణ సంస్థలకు సమాచారం ఇవ్వనున్నారు. రాఘవేంద్రరెడ్డి చేసిన నేరంపై పూర్తి ఆధారాలు లభించే వరకు ఆయనతో పాటు సంస్థలకు చెందిన పూర్తి వివరాలు వెల్లడించలేమని ఈఓడబ్ల్యూ అధికారులు పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు