ఒకటి తరువాత మరొకటి.. వందల సంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లు..

22 Feb, 2022 15:05 IST|Sakshi

నాలుగో సంస్థ నిర్వాహకుణ్ని  పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ 

అందరికీ ఎస్‌ఆర్‌కేయూ నుంచి సర్టిఫికెట్లు సరఫరా 

ఆ వర్సిటీ ఇంజినీరింగ్‌ విభాగాధిపతికీ ప్రమేయం

సాక్షి,హైదరాబాద్‌: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణన్‌ యూనివర్సిటీ (ఎస్‌ఆర్‌కేయూ) నుంచి నగరంలోని విద్యార్థులకు వందల సంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లు సరఫరా అయ్యాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ వర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కేతన్‌ సింగ్‌తో పాటు మూడు కన్సల్టెన్సీల నిర్వాహకులను ఇప్పటికే అరెస్టు చేశారు.

తాజాగా ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మరో కన్సల్టెన్సీ నిర్వాహకుడిని కటకటాల్లోకి నెట్టారు. ఇతడి విచారణలో కేతన్‌తో పాటు ఆ వర్సిటీ ఇంజినీరింగ్‌ (ఈఈఈ) విభాగాధిపతి ఇ.విజయ్‌కుమార్‌కు ఈ స్కామ్‌లో ప్రమేయం ఉన్నట్లు తేలిందని సోమవారం ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు 
వెల్లడించారు.  

విజయవాడకు చెందిన పీకే వీరన్నస్వామి బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వలసవచ్చాడు. చాదర్‌ఘాట్‌ పరిధిలో వీఎస్‌ గ్లోబల్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ పేరుతో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. ఇందులో ఆశించిన మేర ఆదాయం లేకపోవడంతో నకిలీ సర్టిఫికెట్ల దందా మొదలుపెట్టాడు. 

► కేతన్‌ సింగ్‌తో పాటు విజయ్‌కుమార్‌తో ఒప్పందం చేసుకున్న ఇతగాడు ఈ పని మొదలెట్టాడు. డ్రాప్‌ఔట్స్, బ్యాక్‌లాగ్స్‌ ఉన్న వాళ్లతో పాటు ఫెయిల్‌ అయిన విద్యార్థుల వివరాలను కాలేజీల నుంచి సేకరిస్తున్నాడు. ఆ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను సంప్రదిస్తున్న వీరన్న స్వామి ఎలాంటి అడ్మిషన్లు, పరీక్షలు లేకుండా సర్టిఫికెట్లు ఇస్తానని ఒప్పందాలు చేసుకుంటున్నాడు. 

► వీరన్న ఈ విద్యార్థులు, నిరుద్యోగుల వివరాలను వాట్సాప్‌ ద్వారా వర్సిటీలో ఉన్న కేతన్, విజయ్‌లకు పంపిస్తున్నాడు. వీటి ఆధారంగా బ్యాక్‌ డేట్స్‌తో డిగ్రీలు రూపొందిస్తున్న వాళ్లు వర్సిటీలోనూ రికార్డులు సృష్టిస్తున్నారు. ఇలా తయారు చేసిన డిగ్రీలను కోర్సును బట్టి రూ.80 వేల నుంచి రూ.2.5 లక్షలు వరకు విక్రయిస్తున్నా రు. కొన్నాళ్లుగా ఈ దందా గుట్టుగా సాగుతోంది. 

► సమాచారం అందుకున్న నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఎస్సై శ్రీకాంత్‌ తదితరులతో కూడిన బృందం కన్సల్టెన్సీపై దాడి చేసింది. వీరన్నతో పాటు సర్టిఫికెట్లు ఖరీదు చేయడానికి వచ్చిన విద్యార్థులు, నిరుద్యోగులైన కంభపు సాయి గౌతమ్‌ (కొత్తపేట), చిన్‌రెడ్డి రితీష్‌ రెడ్డి (వనస్థలిపురం), బచ్చు వెంకట సాయి సుమ రోహిత్‌ (ఫతేనగర్‌), మున్నా వెల్‌ఫ్రెడ్‌ (వికారాబాద్‌), కోసిమెత్తి సూర్యతేజ (మాదాపూర్‌), తుమ్మల సాయితేజ (బాచుపల్లి) పట్టుబడ్డారు. 

► నిందితులతో పాటు వారి నుంచి స్వాధీనం చేసుకున్న సర్టిఫికెట్లు, స్టాంపులు తదితరాలను తదుపరి చర్యల నిమిత్తం చాదర్‌ఘాట్‌ పోలీసులకు అప్పగించారు. ఇప్పటికే అరెస్టు అయిన కేతన్‌ను పీటీ వారెంట్‌పై ఈ అధికారులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. పరారీలో ఉన్న విజయ్‌కుమార్‌ కోసం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 

మరిన్ని వార్తలు