కస్టమర్లను నమ్మించడానికి నకిలీ చెక్కు ఈ–మెయిల్‌ 

27 Feb, 2021 09:28 IST|Sakshi

సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో సికింద్రాబాద్‌ సంస్థ ఫిర్యాదు 

మొత్తం ఐదు కేసుల్లో రూ.5.7 లక్షలు నేరగాళ్ల పాలు 

సాక్షి, సిటీబ్యూరో: వ్యాపార సంస్థలను టార్గెట్‌గా చేసుకుని ఈ–మెయిల్స్‌ హ్యాకింగ్, స్ఫూఫింగ్‌ ద్వారా వారికి రావాల్సిన డబ్బు కాజేసే నేరాలను అకౌంట్‌ టేకోవర్‌ క్రైమ్‌గా పిలుస్తారు. ఈ తరహా నేరాలు చేసే సైబర్‌ క్రిమినల్స్‌ ఇప్పుడు కొత్త పంథా అనుసరిస్తున్నారు. సికింద్రాబాద్‌కు చెందిన హేమ ఎలక్ట్రానిక్స్‌ సంస్థ శుక్రవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వ్యాపారికి అనుమానం రాకుండా.. అకౌంట్‌ టేకోవర్‌ చేయడం కోసం తొలుత సైబర్‌ నేరగాళ్లు వ్యాపార/ఆర్థిక లావాదేవీతో కూడిన సంస్థల ఈ–మెయిల్‌ ఐడీలను హ్యాక్‌ చేస్తారు. అందులో ఉండే లావాదేవీలతో పాటు వారి భాషా శైలి, చెల్లింపులు/వసూళ్ల విధానం క్షుణ్ణంగా పరిశీలిస్తారు.

హ్యాక్‌ చేసిన తర్వాత ఏ దశలోనూ సదరు వ్యాపారికి అనుమానం రాకుండా జాగ్రత్తపడుతూ వారికి డబ్బు రావాల్సి వచ్చినప్పుడు స్ఫూఫింగ్‌కు దిగుతున్నారు. నిర్ణీత రుసుం తీసుకుని స్ఫూఫింగ్‌ సాఫ్ట్‌వేర్, సదుపాయాన్ని అందించే వెబ్‌సైట్లు ఇంటర్‌నెట్‌లో అనేకం ఉన్నాయి. వీటిలోకి ఎంటర్‌ అయిన సైబర్‌ నేరగాడు తన ఈ–మెయిల్‌ ఐడీతో పాటు ఆ మెయిల్‌ అందుకోవాల్సిన వ్యక్తిది, రిసీవ్‌ చేసుకునేప్పుడు అతడి ఇన్‌బాక్స్‌లో ఏది కనిపించాలో అది కూడా పొందుపరుస్తారు. ఆ తర్వాత నగదు తీసుకోవాల్సిన వ్యక్తి పంపినట్లే ఇవ్వాల్సిన వారికి మెయిల్‌ చేస్తారు. వ్యాపారుల ఈ–మెయిల్స్‌ అప్పటికే హ్యాక్‌ చేసి ఉండటంతో వారే పంపిస్తున్నట్లు కస్టమర్లకు లేఖ పంపిస్తున్నారు.  

బ్యాంకు చెక్కునే మార్ఫింగ్‌ చేసి.. 
అనివార్య కారణాల నేపథ్యంలో తమ బ్యాంకు ఖాతా మారిందని, కొత్త అకౌంట్‌లో నగదు వేయాలని చెప్తూ నేరగాళ్లకు సంబంధించిన నంబర్‌ ఇస్తున్నారు. దీంతో సదరు వ్యాపారికి చేరాల్సిన డబ్బు వీరి ఖాతాలో పడిపోతోంది. హేమ ఎలక్ట్రానిక్స్‌ పేరుతో దాని కస్టమర్‌ సంస్థకు మెయిల్‌ పంపిన నేరగాళ్లు మరో అడుగు ముందుకు వేశారు. ఎదుటి వారు పూర్తిగా నమ్మడం కోసం తమ బ్యాంకు చెక్కునే మార్ఫింగ్‌ చేశారు. వారి పేరు ఉండాల్సిన చోట హేమ ఎలక్ట్రానిక్స్‌ అని రాసి దాన్ని చెల్లింపులు చేసే వారికి పంపిన ఈ–మెయిల్‌లో అటాచ్‌ చేశారు. దీన్ని చూసిన ఓ కస్టమర్‌ హేమ ఎలక్ట్రానిక్స్‌కు చెల్లించాల్సిన రూ.లక్ష సైబర్‌ నేరగాళ్ల ఖాతాలో వేశాడు. ఈ విషయం తెలుసుకున్న హేమ సంస్థ తరఫు వాళ్లు శుక్రవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇది నైజీరియన్‌ నేరగాళ్ల పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. 

మరో నాలుగు కేసుల్లో.. 
♦   గౌలిగూడకు చెందిన యువకుడు కంప్యూటర్‌ హార్ట్‌వేర్‌ ఉత్పత్తుల వ్యాపారం చేస్తుంటారు. మదర్‌ బోర్డులను హోల్‌సేల్‌గా ఖరీదు చేయాలనే ఉద్దేశంతో ఇంటర్‌నెట్‌లో సెర్చ్‌ చేశారు. అందులో కనిపించిన బజాజ్‌ ఇంజినీర్స్‌ అనే సంస్థ యాడ్‌ చూసి వారిని సంప్రదించారు. బోర్డుల సరఫరాకు కొటేషన్లు పంపి, బేరసారాల తర్వాత ఓ ధర ఖరారైంది. అడ్వాన్సుగా రూ.2.25 లక్షలు పంపినా ఆ సంస్థ నుంచి స్పందన లేదు. సంప్రదించడానికి ప్రయత్నించగా ఫోన్లు స్విచ్ఛాఫ్‌ ఉండటంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.  

♦   కంచన్‌బాగ్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి సైబర్‌ నేరగాళ్లు రూ.లక్ష స్వాహా చేశారు. అలానే టోలిచౌకి వాసి పేరుతో అతడి ప్రమేయం లేకుండా ధని లోన్‌ యాప్‌ నుంచి రూ.35 వేల రుణం తీసుకుని మోసం చేశారు. బోయిన్‌పల్లి ప్రాంతానికి ఓ వ్యక్తికి ఇటీవల ఆర్‌బీసీ బ్యాంకు నుంచి డెబిట్‌ కార్డు వచ్చింది. ఆ తర్వాత బ్యాంకు అధికారుల పేరుతో అతడికి ఫోన్‌ వచ్చింది. ఆ పేరుతో ఫోన్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు సదరు కార్డు పని చేయడం ప్రారంభించాలంటే రిజిస్ట్రేషన్‌ చేయాలన్నారు. ఆ పేరుతో కార్డు నెంబర్, సీవీవీ కోడ్, ఓటీపీ సహా ఇతర వివరాలు బాధితుడి నుంచి తీసుకుని రూ.1.10 లక్షలు కాజేశారు.

మరిన్ని వార్తలు