ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని కన్నవారికే టోకరా.. కట్‌ చేస్తే!

18 Apr, 2021 15:27 IST|Sakshi

ఉద్యోగాలిప్పిస్తానని రూ.80లక్షలు వసూలు

ఇదీ నకిలీ ఐఏఎస్‌ లక్ష్మీనారాయణ బాగోతం

వివరాలు వెల్లడించిన డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి

సాక్షి, మంచిర్యాలక్రైం: నకిలీ ఐఏఎస్‌ బర్ల లక్ష్మినారాయణ మోసాలు.. అక్రమాలకు అంతులేకుండా సాగింది. తక్కువ సమయంలో.. ఎక్కువ డబ్బు, హోదా సంపాదించాలన్న అతడి దురాశ.. తన తల్లిదండ్రులనే మోసం చేయించింది. తన మాటలకు కన్నవారు మోసపోయారు..! ఇక ఇతరులు మోసపోరా..? అనుకున్నాడో ఏమోగాని.. వెంటనే తన పథకాన్ని అమల్లోకి తెచ్చి చివరకు కటకటాల పాలయ్యాడు. ఈనెల 12న వెలుగులోకి వచ్చిన నకిలీ ఐఏఎస్‌ బర్ల లక్ష్మీనారాయణ (22) మంచిర్యాల పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. అతడి వివరాలను స్థానిక డీసీపీ కార్యాలయంలో డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి విలేకరులకు వెల్లడించారు. 

జగిత్యాల జిల్లా బీర్పూర్‌ మండలం రేకులపల్లి గ్రామానికి చెందిన బర్ల శంకరయ్య కుమారుడు లక్ష్మీనారాయణ హైదరాబాద్‌లోని సిద్దార్థ కళాశాలలో బీటెక్‌ థర్డ్‌ ఇయర్‌ చదువుతుండగా.. పాకెట్‌ మనీ కోసం సికింద్రాబాద్‌ క్లాక్‌ టవర్‌ వద్ద ఎస్‌బీఐ కార్డ్స్‌ డివిజన్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసేవాడు. అదే సమయంలో రైల్వేలో ఉద్యోగం కోసం పరీక్ష రాశాడు. తాను పరీక్షలో పాసయ్యాయనని, రైల్వేలో డీఈగా ఉద్యోగం వచ్చిందని తల్లిదండ్రులను నమ్మించాడు.

లక్ష్మినారాయణ చిన్నతనంలోనే మంచి ఉద్యోగం సాధించాడని పేర్కొంటూ గ్రామస్తులు, బంధువులు ఘనంగా సన్మానం కూడా చేశారు. తల్లిదండ్రులతో ఓ బ్రీజా కారు కొనిపించుకున్నాడు. అప్పటినుంచి జల్సాలకు అలవాటు పడ్డాడు. తల్లి దండ్రులను ఈజీగా నమ్మించి మోసం చేసిన లక్ష్మినారాయణ.. ఇలాగే ప్రజలను కూడా మోసం చేయొచ్చని భావించాడు. అప్పటినుంచే మోసాలకు తెరలేపాడు. ఏకంగా తాను ఐఏఎస్‌ అయ్యానని, జాయింట్‌ కలెక్టర్‌గా ఉద్యోగం వచ్చిందని నమ్మించాడు. 

మంచిర్యాల జేసీగా ప్రచారం..
తనకు రైల్వేలో ఉద్యోగం వచ్చిందని, మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో డీఈగా పని చేస్తున్నానని నమ్మించాడు. తన కారుకు బీర్పూర్‌కు చెందిన తాళ్లపెల్లి రమేష్‌ను డ్రైవర్‌గా పెట్టుకున్నాడు. అతడికి నెలకు రూ.25వేలు వేతనంగా చెల్లించాడు. తాను సివిల్స్‌ పరీక్ష రాశానని, త్వరలోనే రిజల్ట్‌ వస్తుందని చెప్పాడు. 2020 డిసెంబర్‌లో తాను ఐఏఎస్‌గా సెలక్ట్‌ అయ్యానని, మంచిర్యాల జేసీగా పోస్టింగ్‌ ఇచ్చారని నమ్మ బలికాడు. దీంతో తన మకాం మంచిర్యాలకు మార్చాడు. జిల్లాకేంద్రంలోని ఆదిత్య ఎన్‌క్లేవ్స్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు దిగాడు. డ్రైవర్‌ రమేష్‌ను పర్మినెంట్‌ చేస్తానని చెప్పి అతడి నుంచి రూ.3 లక్షలు వసూలు చేశాడు. అప్పటి నుంచి రమేష్‌కు రూ.నెలకు 45వేల జీతం ఇచ్చాడు.

రమేష్‌కు తెలిసిన మరో స్నేహితుడు దండేపల్లి మండలం రెబ్బెనపెల్లికి చెందిన మహేందర్‌ను పీఏ (పర్సనల్‌ అసిస్టెంట్‌)గా నియమించుకున్నాడు. రమేష్, మహేందర్‌లు తాము కలెక్టర్‌ వద్ద పనిచేస్తున్నామని గర్వంగా తమతమ ఊళ్లో చెప్పుకున్నారు. ఓ రోజు రమేష్, మహేందర్‌తో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. తాను ఐఏఎస్‌ అయినందున పర్సనల్‌ కోటా కింద 30మంది వరకు ఉద్యోగాలు ఇప్పించే అవకాశం ఉంటుందని, ఎవరైనా ఉద్యోగం కోసం వస్తే తనవద్దకు పంపాలని నమ్మించాడు.

ఆయన మాటలు నమ్మిన రమేశ్, మహేందర్‌ తమకు తెలిసిన వారికి ఈ విషయం చెప్పడంతో చాలామంది లక్ష్మినారాయణను ఆశ్రయించారు. వీరిలో కొందరి సర్టిఫికెట్లు పరిశీలించి.. కొంత ఖర్చు అవుతుందని చెప్పి సుమారు 29మంది నుంచి రూ.80 లక్షలు వరకు వసూలు చేశాడు. వీటితో రెండు విలువైన కార్లు, బుల్లెట్‌ బైక్, జగిత్యాలలో ఓ ఇళ్లు, ఓ ఓపెన్‌ స్లాబ్‌ కొనుగోలు చేశాడు.  

వెలుగు చూసిందిలా..
లక్ష్మీనారాయణ వ్యవహారంపై అనుమానం కలిగిన రమేష్‌ మంచిర్యాల పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు ఈనెల 12న లక్ష్మినారాయణ ఉంటున్న అపార్ట్‌మెంట్‌పై ఆకస్మికంగా దాడి చేశారు. అక్కడ ఐఏఎస్‌ బోర్డు, నల్ల కోటు కనిపించడంతో స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. మరోవైపు బాధితులు కూడా పెద్ద సంఖ్యలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు లక్ష్మినారాయణను శనివారం అరెస్ట్‌ చేసి.. అతడి నుంచి రెండు కార్లు, బుల్లెట్‌ బైక్, బాధితుల సర్టిఫికెట్స్, ఏడు రిజిస్టర్లు, రూ.2.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 

అభినందించిన సీపీ, డీసీపీ, ఏసీపీ
నకిలీ ఐఏఎస్‌ను పటుకున్న సీఐ ముత్తి లింగయ్య, ఎస్సై దేవయ్య, కిరణ్‌కుమార్‌ను సీపీ సత్యనారాయణ డీసీపీ, ఏసీపీ అభినందించారు.  

మరిన్ని వార్తలు