నకిలీ ఐఏఎస్‌ అరెస్ట్‌

11 Aug, 2020 05:42 IST|Sakshi
నకిలీ ఐఏఎస్‌ అధికారి విజయలక్ష్మీ

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌ (గన్నవరం): నకిలీ ఐఏఎస్‌ అధికారి అవతారమెత్తి వసూళ్లకు పాల్పడుతున్న పెద్దాడ విజయలక్ష్మి అనే ఓ కిలాడీ లేడి కృష్ణాజిల్లా, హనుమాన్‌జంక్షన్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఏపీ ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సంస్కరణల కమిటీ చైర్మన్‌నంటూ వసూళ్లు చేయబోయి అడ్డంగా బుక్కైంది. ఈ కేసు వివరాలను నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు సోమవారం విలేకరులకు వెల్లడించారు. 

రిటైర్డ్‌ ఐఏఎస్‌ సుజాతరావుగా నమ్మించి... 
గుంటూరు జిల్లా మంగళగిరిలోని మన్యం వారి వీధికి చెందిన పెద్దాడ విజయలక్ష్మి... పద్మభూషణ్‌ కేఎల్‌ రావు కుమార్తె, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కె.సుజాతరావు పేరుతో పలువురిని నమ్మించి కేఎల్‌ రావు విగ్రహ ఏర్పాటు పేరుతో వసూళ్లు చేసినట్లుగా తెలుస్తోంది. 

పోలీసులకు ఎలా చిక్కిందంటే.. 
హనుమాన్‌జంక్షన్‌లోని వైఎస్సార్‌ సీపీ పొలిటికల్‌ అడ్వయిజరీ కమిటీ సభ్యులు డాక్టర్‌ దుట్టా రామచంద్రరావుకు చెందిన సీతామహాలక్ష్మి నర్సింగ్‌ హోంకు ఈ నెల 8వ తేదీన ఓ కారులో వచ్చిన విజయలక్ష్మి తాను ఏపీ ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సంస్కరణల కమిటీ చైర్మన్‌ సుజాతరావునని, తాను తిరుపతి వెళుతున్నానని, పూజల కోసం రూ.3,500 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో అనుమానించిన రామచంద్రరావు తనయుడు రవిశంకర్‌ నేరుగా కె.సుజాతరావుకు ఫోన్‌ చేయగా, తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని ఆమె చెప్పారు.

నకిలీ అధికారి ఫోటోలు తీసేందుకు యత్నించటంతో వెంటనే పరారయ్యారు. ఆ తర్వాత ఎస్పీ రవీంద్రబాబుకు కె.సుజాతరావు ఫోన్‌ చేసి నకిలీ అధికారిని పట్టుకోవాలని కోరారు. రవిశంకర్‌ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదివారం రాత్రి ఆమెను విజయవాడలో పట్టుకున్నారు. టీడీపీతో కిలాడీ లేడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని విచారణలో వెల్లడించింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో దిగిన ఫోటో ఆమె వద్ద పోలీసులకు లభించింది. 

మరిన్ని వార్తలు