నకిలీ ఐపీఎస్‌ అధికారి అరెస్టు

1 Jan, 2021 08:04 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న నగదు, బంగారాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ రమేష్‌ రెడ్డి

రూ.12 లక్షలు స్వాధీనం

సాక్షి, తిరుపతి: ఐపీఎస్‌ అధికారినంటూ నగదు వసూలు చేసిన కేసులో హైదరాబాద్‌కు చెందిన మహ్మద్‌ముస్తాక్‌ అలియాస్‌ దిలిహీముస్తాక్‌ను క్రైం పోలీసులు అరెస్టు చేసినట్టు అర్బన్‌ జిల్లా ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డి తెలిపారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మహ్మద్‌ముస్తాక్‌ తాను హైదరాబాద్‌ కమిషనర్‌గా పనిచేస్తున్నానని ప్రజలను నమ్మించేవాడు. తన కు రాజకీయ నాయకులు, ప్రభుత్వంలో మంచి పరిచయాలు ఉన్నాయని, కావాల్సిన వారికి ఇసుక క్వారీలు, టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.39 లక్షల వరకు మోసాలకు పాల్పడ్డాడు.

2013లో శ్రీకాళహస్తికి చెందిన వహీదాను వివాహం చేసుకున్నాడు. ఈమె కోసం హైదరాబాద్‌ నుంచి శ్రీకాళహస్తికి వచ్చే సమయంలో స్థానిక రైల్వే స్టేషన్‌లో విజయా డెయిరీ నడుపుతున్న లీలావతి దేవితో పరిచయం పెంచుకున్నాడు. ఆమె ద్వారా డ్వాక్రా సభ్యులు మునిరాజమ్మ, భాను, యశోద, జయలక్ష్మి, హేమలత, నాగరాజు, మధును పరిచయం చేసుకున్నాడు. టీటీడీ ఉద్యోగాలు, డ్వాక్రా మహిళలకు ఇసుక క్వారీ లు ఇప్పిస్తామని నమ్మించి వారివద్ద నుంచి రూ.39 లక్షలు వసూలు చేసి పరారయ్యాడు. హేమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి రూ.12 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.

అంతర్రాష్ట్ర దొంగలు అరెస్టు  
తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడే అంతర్రాష్ట్ర దొంగలను క్రైం పోలీసులు అరెస్టు చేసినట్టు ఎస్పీ రమేష్‌రెడ్డి పేర్కొన్నారు. వారి వద్ద నుంచి 845 గ్రాముల బంగారు, 400 గ్రాముల వెండి, రూ.12 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

పాత నేరస్తులు అరెస్టు  
తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌ చేస్తూ దొంగతనాలకు పాల్పడే దాము, సయ్యద్‌ అబ్దులాకరీమ్‌ను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. తిరుపతి, శ్రీకాళహస్తి పరిసరాల్లో జరిగిన 30 పైగా కేసుల్లో వీరు నిందితులని పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి 173 గ్రాముల బంగారు, 400 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు.

మరిన్ని వార్తలు