ఫేక్‌ ఆఫీసర్‌..! రహస్యంగా తీసిన వీడియోలతో బ్లాక్‌మెయిల్‌

23 Jun, 2021 07:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చెన్నై: సామాజిక మాధ్యమాల ద్వారా  తాను పోలీసు అధికారిగా పేర్కొంటూ మహిళలకు లైంగిక వేధింంపులు ఇస్తున్న ప్రబుద్ధుడి గట్టును భార్య బయటపెట్టింది. మంగళవారం మదురై కమిషనరేట్‌లో ఆధారాలతో సహా సమర్పించి పట్టించింది. గత ప్రభుత్వంలో ఓ మంత్రి వద్ద  ముత్తు గన్‌మెన్‌గా పనిచేశాడు. అయితే తానో పోలీసు అధికారిగా నమ్మించి ఏడాది క్రితం సుభాషిణిని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వీరు మదురై రిజర్వ్‌ బ్యాంక్‌ కాలనీ పోలీసు క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. 

పెళ్లయిన తర్వాత భర్త గురించి తెలిసినా సర్దుకుపోయింది. అయితే ఓ రోజు భర్త సెల్‌ ఫోన్‌ తీసి చూడగా మహిళలకు ఇస్తున్న బెదిరింపులు వెలుగు చూశాయి. దీంతో భర్తతో గొడవ పడి పుట్టింటికి వెళ్లి పోయింది. మళ్లీ ఇలాంటి పనులు చేయనని లిఖిత పూర్వకంగా రాసి ఆమెను కాపురానికి తీసుకొచ్చాడు. కొద్ది రోజులు బాగున్న ముత్తు మళ్లీ పాత ఫందాను కొనసాగించాడు. మహిళలను హోటళ్లకు తీసుకెళ్లడం, వారితో గడిపిన దృశ్యాలను చిత్రీకరించి బెదిరించడం  చేస్తుండేవాడు.

మదురై కమిషనరేట్‌లో ఫిర్యాదు
అధికారినని చెప్పి తనను మోసం చేయడమే కాకుండా మహిళల జీవితాలతో ఆడుకుంటున్న భర్తపై మదురై కమిషనరేట్‌లో భార్య సుభాషిణి మంగళవారం ఫిర్యాదు చేసింది. ఫేక్‌ఐడీలతో తన భర్త సాగిస్తున్న లైంగిక  వేధింపులు, మహిళలతో చాటింగ్‌లు, బెదిరింపులు, వసూళ్లపై ఆధారాలతో సహా పోలీసు ఉన్నతాధికారులకు సమర్పించింది.

మహిళలపై తన భర్త సాగిస్తున్న తీరుతో న్యాయం కోసం కమిషనరేట్‌ను ఆశ్రయించినట్టు సుభాషిణి తెలిపారు. గతంలో తాను ఇదే రకంగా  ఓ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, మంత్రి గన్‌మెన్‌ కావడంతో అక్కడి సిబ్బంది వెనక్కు తగ్గారని, ఇక తన భర్త తప్పించుకోలేడని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదును ఉన్నతాధికారులకు పంపించి విచారణ చేస్తున్నారు.
చదవండి: కన్నతల్లి కర్కశత్వం: బతికుండగానే బావిలోకి తోసేసింది

మరిన్ని వార్తలు