భార్య సహకారం.. యువతిని భయపెట్టి ఐదేళ్లుగా అఘాయిత్యం

24 Aug, 2022 08:19 IST|Sakshi

సైబర్‌ నేరగాళ్ల మాదిరిగానే నకిలీ బాబాలు, స్వాములు అమాయకులను వంచించడం విస్తరిస్తోంది. అమాయక యువతిపై కన్నేసి బెదిరింపుల ద్వారా లోబర్చుకున్నాడో నకిలీ స్వామి. యువతికి త్వరలోనే పెద్ద గండం ఉందని చెప్పాడు కానీ అది తన వల్లే అని చెప్పలేదు. గండం పోగొట్టుకోవాలని ఆశ్రమానికి వెళ్లిన అభాగ్యురాలు సాలెగూట్లో చిక్కుకున్న ప్రాణిలా విలవిలలాడింది.

(కర్ణాటక) కృష్ణరాజపురం: యువతి అమాయకత్వాన్ని అనువుగా మలుచుకుని పూజల పేరుతో మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడో నకిలీ స్వామీజీ. ఆపై ఆమెను ఫొటోలు, వీడియోలు తీసి బెదిరిస్తూ వాంఛలు తీర్చుకుంటున్న కామాంధుడు చివరికి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన ఎక్కడో మారుమూల కుగ్రామంలో కాదు, సిలికాన్‌ సిటీలోని కృష్ణరాజపురం పరిధిలో చోటు చేసుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నకిలీ స్వామి ఆనంద మూర్తి, అతని భార్య లతపై అత్యాచారం, మోసం, హత్యాయత్నం, బెదిరింపు సెక్షన్ల కింద ఆవల హళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు.  

పెళ్లిలో కలిసి, ఆశ్రమానికి రప్పించి 
 సుమారు ఐదు సంవత్సరాల కిందట ఆ యువతి స్నేహితురాలి పెళ్లికి వెళ్లినప్పుడు అక్కడ నకిలీ స్వామీజీ ఆనందమూర్తి పలకరించాడు. ఇతనికి ఆవలహళ్లిలో ఓ ఆశ్రమం ఉంది. నీ జీవితంలో చాలా పెద్ద గండం ఉంది. దాని వలన నీతో పాటు నీ కుటుంబ సభ్యులకు తీవ్ర ఇబ్బందుల్లో పడతారు, అది జరగకుండా ఉండాలంటే  ప్రత్యేక పూజలు చేయాలని యువతిని మానసికంగా భయపెట్టాడు. గండం పోవాలనుకున్న బాధితురాలు అతను చెప్పినట్లు ఆశ్రమానికి వెళ్లి పెద్ద గండంలో చిక్కుకుంది. పూజ, హోమం చేస్తున్నట్లు చెప్పి యువతికి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడు. ఇందుకు అతని భార్య లత కూడా సహకరించింది. ఆపై యువతిని ఫొటోలు, వీడియోలు తీసి ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు, చెబితే వీడియోలను ఇంటర్నెట్‌లో పెడతా, నిన్ను చంపేస్తానని బెదిరించి సుమారు ఐదు సంవత్సరాలుగా యువతిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు.  

యువతికి నిశ్చితార్థం చెడగొట్టి..  
ఇటీవల యువతికి ఆమె తల్లిదండ్రులు పెళ్లి సంబంధం చూసి నిశ్చితార్థం నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న నకిలీ స్వామీజీ కాబోయే వరున్ని కలిసి తనవద్దనున్న యువతి వీడియోలను చూపించి పెళ్లిని రద్దు చేయించాడు. నీవు నా సొంతం, నా వద్ద ఉండాలి, నీవు ఎవరిని పెళ్లి చేసుకున్నా వదలను అని బెదిరించాడు. యువతి నకిలీ స్వామీజీ చిత్రవధను తట్టుకోలేక తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వెంటనే వారు ఆవలహళ్లి పోలీసులకు  ఫిర్యాదు చేశారు. ఆనందమూర్తి దంపతులు ఇలా ఎంతోమందిని మోసం చేశారని ఆరోపణలున్నాయి. ఇతని బాధితులు ఎవరైనా ఉంటే తమను కలిసి ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరారు.

మరిన్ని వార్తలు