బరితెగింపునకు పరాకాష్ట

8 Oct, 2020 04:43 IST|Sakshi
సరస్వతీ దేవి విగ్రహం ధ్వంసం అంటూ టీడీపీ సోషల్‌ మీడియా ఫేస్‌బుక్‌ పేజీల్లో పెట్టిన పోస్ట్‌

సరస్వతీదేవి విగ్రహం ధ్వంసం అంటూ తప్పుడు ప్రచారం  

రెండేళ్ల క్రితం నాటి ఘటనను తాజాగా చూపే కుట్ర   

సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్న టీడీపీ, ఇతర పార్టీలు 

ఈ ఘటనలో ఇద్దరి అరెస్ట్‌.. ప్రధాన నిందితుడి కోసం గాలింపు

సాక్షి, గుంటూరు: ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా టీడీపీ, మరికొన్ని రాజకీయ పార్టీలు సోషల్‌ మీడియాలో వస్తున్న నిరాధారమైన పోస్ట్‌లకు మతం, కులం, రాజకీయ రంగు పులుముతున్నాయి. ఎద్దు ఈనిందంటే గాటికి కట్టెయ్యండన్న చందంగా బరితెగించి ప్రతి విషయాన్ని ప్రభుత్వానికి ముడిపెడుతున్నాయి. నరసరావుపేటలో సరస్వతీ దేవి విగ్రహం ధ్వంసం అంటూ మంగళవారం పుట్టుకొచ్చిన దుష్ప్రచారం ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. ‘గుంటూరు జిల్లా నరసరావుపేటలో దారుణం.. శృంగేరి శంకర మఠం సమీపంలో ఉన్న సరస్వతీ దేవి విగ్రహం ధ్వంసమైంది. విగ్రహంపై మద్యం పోశారు. దుండగులు విగ్రహాన్ని పగులగొట్టారు’ అంటూ మంగళవారం మధ్యాహ్నం 12.45 గంటలకు చల్లా మధుసూదన్‌ రావు అనే వ్యక్తి వాట్సప్‌ గ్రూప్‌లో తప్పుడు పోస్ట్‌ చేశాడు. ఆ తర్వాత 12.49 గంటలకు ఏపీ మీడియా అనే 68 వేల మంది సభ్యులున్న టెలీగ్రామ్‌ గ్రూప్‌లోకి ఆ మెసేజ్‌ను షేర్‌ చేశారు. అనంతరం ఈ విషయం సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌ అయింది.   

► ఈ ఘటన వాస్తవమో.. కాదో ధ్రువీకరించుకోకుండానే తెలుగుదేశం పొలిటికల్‌ వింగ్, సీబీఎన్‌ ఆర్మీ గుంటూరు టిస్ట్రిక్ట్, జై తెలుగుదేశం, టీడీపీ అఫీషియల్, సీబీఎన్‌ సోల్జర్స్, సాహో చంద్రబాబు.. తదితర టీడీపీ అనుకూల విభాగాలు ఈ సమాచారాన్ని వైరల్‌ చేశాయి. ఎల్లో మీడియా సైతం నిర్ధారణ చేసుకోకుండానే వార్తలు ప్రసారం చేసింది. 
► సరస్వతి దేవి విగ్రహం ధ్వంసం అంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని స్థల యజమాని కపలవాయి విజయ్‌కుమార్‌ మీడియా ముందుకు వచ్చి ఖండించారు. స్థలం లీజుకు తీసుకున్న కళాశాల యాజమాన్యం ఖాళీ చేసి వెళ్లే సమయంలో రెండేళ్ల క్రితమే విగ్రహం దెబ్బతినిందని వివరించారు.  
► ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. మురళి, మహేశ్‌రెడ్డి అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు చల్లా మధుసూదన్‌ రావు కోసం గాలిస్తున్నారు. 

తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు
సరస్వతీ దేవి విగ్రహం ధ్వంసం అంటూ కొందరు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేశారు. గతంలో ఎప్పుడో జరిగిన ఘటనను ఇప్పుడు జరిగినట్టు చిత్రీకరిస్తూ మతం రంగు పూశారు. ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. సోషల్‌ మీడియా పోస్టులపై నిరంతరం నిఘా ఉంటుంది. ఇలాంటి మెసేజ్‌లు షేర్‌ చేసే ముందు ఒకటికి రెండు సార్లు నిర్ధారించుకోవాలి. 
    – విశాల్‌ గున్నీ, గుంటూరు రూరల్‌ ఎస్పీ 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు