ఒకేసారి నాలుగు ప్రాణాలు: కుటుంబాన్ని చిదిమేసిన కరోనా

8 May, 2021 18:08 IST|Sakshi

అహ్మదాబాద్‌: మహమ్మారి వైరస్‌ దేశంలో భయాందోళన రేపుతోంది. మానవ జీవితాన్ని అల్లకల్లోలం చేస్తోంది. ఈ వైరస్‌ దెబ్బకు కుటుంబాలకు కుటుంబాలే నాశనమవుతున్నాయి. వైరస్‌ ధాటికి తట్టుకోలేక ఛిన్నాభిన్నమవుతున్నాయి. తాజాగా కరోనా వైరస్‌ వ్యాప్తితో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆవేదనకు గురి చేస్తోంది. వైరస్‌తో కుటుంబ పెద్ద మృతి చెందగా అతడి అంత్యక్రియలు నిర్వహించారు. అక్కడ అంత్యక్రియలు ముగియనే లేదు ఆయన భార్య, పిల్లలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

గుజరాత్‌లోని జిల్లాకేంద్రం దేవభూమి ద్వారకలోని రుష్మానీనగర్‌లో జయేశ్‌ భాయ్‌ జైన్‌ (60), భార్యా ఇద్దరు పిల్లలతో జీవిస్తున్నాడు. ఆయనకు ఇటీవల కరోనా సోకింది. పరిస్థితి విషమించడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం జయేశ్‌ మృతి చెందాడు. ఆయన మృతితో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. ఆయన అంత్యక్రియలు గురువారం సాయంత్రం నిర్వహించారు. అయితే ఆయన మృతిని భార్య సాధన బెన్‌, కుమారులు కమలేశ్‌ (35), దుర్గేశ్‌ (27) తట్టుకోలేకపోయారు. అంత్యక్రియలు జరిగిన రెండు గంటలకే తల్లి, కుమారులు మూకుమ్మడిగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లోనే పురుగుల నివారణ మందు తాగి బలవన్మరణం పొందారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

చదవండి: కరోనా కల్లోలం: 14 రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌
చదవండి: ఆస్పత్రి నుంచి 23 కరోనా బాధితులు పరార్‌

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు