అంతుచిక్కని వ్యాధితో కరీంనగర్‌లో కుటుంబం బలి

31 Dec, 2022 11:51 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: అంతుచిక్కని వ్యాధితో కరీంనగర్‌ జిల్లాలో ఓ కుటుంబం బలైంది. ఒకే వ్యాధితో ఇద్దరు చిన్నారులతో సహా తల్లిదండ్రులు మృతి చెందిన ఘటన  గంగాధర మండల కేంద్రంలో కలకలం సృష్టిస్తోంది. నెల వ్యవధిలో ఒకే ఇంట్లో నలుగురు మృత్యువాతపడ్డారు. వివరాలు..గంగాధరకు చెందిన లక్ష్మీపతి కుమారుడు శ్రీకాంత్‌కు చొప్పదండికి చెందిన మమతతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరగగా వీరికి కూతురు అమూల్య (6), కుమారుడు అద్వైత్ (2) జన్మించారు.

నవంబర్‌ నెలలో మొదట శ్రీకాంత్‌ తనయుడు అద్వైత్‌ వాంతులు విరేచనాలు, వాంతులు చేసుకొని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. తనయుడి మరణం నుంచి కోలుకోకముందే శ్రీకాంత్‌ కూతురు అమూల్యం కూడా వాంతులు, విరేచనాలతో బాధపడుతూ డిసెంబర్‌9న కన్నుమూసింది. నెల వ్యవధిలోనే కంటికి రెప్పలా కాపాడుకున్న కొడుకు, కూతురు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రుల రోదనకు అంతులేకుండా పోయింది.

ఇటీవల ఉన్నట్టుండి మమత అస్వస్థతకు గురైంది. చిన్నారుల ప్రాణాలు తీసిన వింతవ్యాధి ఆమెను కూడా ఉక్కిరిబిక్కిరిచేసింది. ప్రమాదాన్ని గ్రహించిన శ్రీకాంత్‌ వెంటనే  హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించాడు.  అక్కడ చికిత్స పొందుతూ మమత ఆదివారం తుదిశ్వాస విడిచింది. ఒక్కొక్కరుగా తనవారు దూరమవడంతో శ్రీకాంత్‌కు ఏడుపే మిగిలింది.  భార్య, పిల్లల మృతితో అనారోగ్యానికి గురైన శ్రీకాంత్‌ కూడా శనివారం ఉదయం ఇంట్లో రక్తం కక్కుకొని మరణించాడు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు.. మృతుల రక్త నమూనాలను పుణె ల్యాబ్‌కు పంపించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  అయితే ఆ కుటుంబానికి బలితీసుకున్న వ్యాధి ఏంటనేది మిస్టరీగా మారింది. జన్యుపర లోపాలా లేక ఇతరాత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొదట హైదరాబాద్‌లో చికిత్స పొందిన చిన్నారులు, తల్లి విషయంలో  డాక్టర్లు వీరికి సోకిన వ్యాధిని నిర్ధారించలేకపోయారని మృతుల బంధువులు చెప్తున్నారు. మరోవైపు అంతుచిక్కని వ్యాధిపై గంగాధర స్థానికల్లో ఆందోళన వ్యక్త మవుతోంది.

మరిన్ని వార్తలు