వివాహేతర సంబంధం: కుటుంబం బలి

2 Aug, 2021 08:48 IST|Sakshi

గోదావరి నదిలో దూకి ఇద్దరు పిల్లలు సహా భార్యాభర్తల ఆత్మహత్య

ఉభయగోదావరి జిల్లాల్లో విషాదం

‘డాడీ.. నేను ఒకడి చేతిలో మోసపోయాను. నా జీవితాన్ని నాశనం చేశాడు.. ఫలితంగా నేను, నా భర్త, పిల్లలు ఇద్దరితో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నాం..’ చనిపోయే ముందు.. ఆ ఇల్లాలి ఆడియో సందేశం ఇది. వాట్సాప్‌ గ్రూపుల్లో హల్‌చల్‌ చేసింది. దీనిని బట్టి చెప్పొచ్చు.. వివాహేతర సంబంధం మూలంగా ఆమె ఎంత క్షోభ అనుభవించిందో. ఎంత మానసిక వేదనకు గురైందో. చివరికి తను, భర్త, ఇద్దరు పిల్లల ప్రాణాలను మూల్యంగా చెల్లించుకుంది..

యలమంచిలి/మామిడికుదురు/మలికిపురం: వివాహేతర సంబంధం ఒక నిండు కుటుంబాన్ని బలి తీసుకుంది. తూర్పు గోదావరి జిల్లా మొగలికుదురుకు చెందిన కంచి సతీష్‌ (32) కంచి సంధ్య (22)లు తమ పిల్లలు జశ్వన్‌ (4), ఇందుశ్రీదుర్గ (2)లతో కలిసి గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో సతీష్, ఇందుశ్రీదుర్గ మృతదేహాలు ఆదివారం పోలీసులకు లభించగా తల్లి, కుమారుడి మృతదేహాల కోసం గాలిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట గ్రామానికి చెందిన సంధ్యకు తూర్పుగోదావరి జిల్లా మొగలికుదురుకు చెందిన సతీష్‌తో ఆరేళ్ల కిందట వివాహమైంది. తాపీ పని చేసుకునే సతీష్‌ రెండేళ్ల కిందట గల్ఫ్‌ దేశాలకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో సంధ్యకు కేశవదాసుపాలేనికి చెందిన ఫణీంద్రతో వివాహేతర సంబంధం ఏర్పడింది.

ఈ నేపథ్యంలో ఫణీంద్ర సంధ్య నుంచి బంగారం, నగదు కూడా తీసుకున్నాడు. విషయం బయటకు పొక్కడంతో పెద్దల సమక్షంలో రాజీ ప్రయత్నాలు జరిగాయి. కొంత బంగారం, నగదు వెనక్కి వచ్చాయి. దీంతో సంధ్య అత్తమామలు.. పిల్లల్ని వారి దగ్గర ఉంచుకుని కోడల్ని పుట్టింటికి పంపేశారు. ఇదిలా ఉండగా గత నెల 20న గల్ఫ్‌ నుంచి  వచ్చిన సతీష్‌కు జరిగిన విషయం తెలియడంతో మానసికంగా కుంగిపోయాడు. మద్యానికి బానిస కావడంతో తల్లిదండ్రులు అతనిని కేశవదాసుపాలెంలో ఉన్న పెద్దక్క ఇంటికి పంపారు. అక్కడ నుంచి సతీష్‌ ఈ నెల 29న భార్యకు ఫోన్‌ చేశాడు. పాలకొల్లు మండలం వెలివెలలోని తన పెద్దమ్మ నాగలక్ష్మి ఇంటి వద్ద ఉన్నానని భార్య చెప్పడంతో పిల్లలతో కలిసి అక్కడకు వెళ్లాడు. జరిగిన సంగతి మరచిపోయి కలిసి బతుకుదామని చెప్పడంతో సంధ్య కూడా ఒప్పుకుంది.


ఆ తర్వాత భార్యను అత్మహత్యకు సిద్ధం చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో మొగలికుదురుకు బయలుదేరారు. చించినాడ వంతెన మీద బైక్‌ పెట్టి గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు తండ్రికి సంధ్య వాట్సాప్‌లో వాయిస్‌ మెసేజ్‌ చేసింది. సతీష్‌ కుటుంబం అదృశ్యమైనట్టు శనివారమే కలకలం రేగింది. వారి బైక్, పిల్లల దుస్తులు ఘటనా స్థలంలో లభించడంతో వాటిని గుర్తు పట్టిన సతీష్‌ పెద్ద బావ కుడుపూడి పల్లయశెట్టి.. పాలకొల్లు రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాలకొల్లు రూరల్‌ సీఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఫణీంద్ర, వాళ్ల కుటుంబ సభ్యుల కారణంగానే తామంతా చనిపోతున్నట్టు సంధ్య రాసిన ఉత్తరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

 

మరిన్ని వార్తలు