భార్యపై కోపం.. పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఫోన్‌ రావడంతో సొంత కొడుకునే..

12 Jul, 2022 10:26 IST|Sakshi
కొడుకుతో రమేష్‌(ఫైల్‌)

భార్యపై అనుమానంతో దారుణం

ప్రేమించి పెళ్లి చేసుకున్నా కలవని మనసులు

తాగిన మత్తులో కొడుకునే బలితీసుకునే యత్నం

ప్రాణాపాయ స్థితిలో బాలుడు 

ప్రేమ.. ప్రేమ.. ప్రేమ.. మనసులు కలిసి, మనుషులు ముడిపడే వరకు ఎంతకైనా తెగిస్తుంది. తల్లిదండ్రులను ఎదురిస్తుంది.. బంధుత్వాలను దూరం చేస్తుంది.. కల సాకారం చేసుకున్నా, ప్రేమను గెలిపించుకున్నా.. కొన్ని జీవితాలే కలకాలం నిలుస్తున్నాయి. ఇంకొన్ని రోజులు గడిచేకొద్దీ బలహీనపడి ప్రాణాలు తీసుకునే స్థాయికి చేరుతున్నాయి. ఈ కోవలోనే ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట మధ్య పెరిగి పెద్దదైన అనుమానం వారి ప్రేమకు ప్రతిరూపంగా నిలిచిన కన్న కొడుకునే మంటల్లోకి నెట్టడం ప్రేమ‘కులం’లో కలంకం.

భార్యపై కోపం కొడుకుకు శాపమైంది. ఈ రోజు చంపేస్తానని ఉదయం నుంచీ తిట్టిపోశాడు. పోలీసుల భయంతో పినాయిల్‌ తాపించాడు.. తాగిన మైకంలో పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు.. ఒళ్లంతా కాలిన గాయాలు.. ఒకటే మంట.. ప్రాణం నిలుస్తుందో లేదో తెలియదు.. ఇప్పుడు కూడా నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లికంటే ఆ చిన్నారి మనసు నాన్ననే కోరుకుంటోంది.. చంపేందుకు యత్నించినా ఆ పసి హృదయం నాన్నను చూడాలి, ఎక్కడని రోదిస్తున్న తీరు అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. 

అతను డిగ్రీ పూర్తి చేస్తే.. ఆమె ఇంటర్‌ చదివింది. రెండేళ్ల పాటు ప్రేమించుకున్నారు. సామాజిక వర్గం ఒకటే కావడం.. పైగా బంధువులు, ఇరువైపులా ఎలాంటి పట్టింపులు లేకపోవడంతో పెళ్లితో ఒక్కటయ్యారు. కోరుకున్న జీవితం సాకారం కావడంతో ఆ ఇద్దరికీ మరో ఇద్దరు పిల్లలు.. సంసారం సాఫీగా సాగిపోతున్న తరుణంలో అనుమానం పెనుభూతమైంది.. తాగుడు తోడై ఆ కుటుంబంలో చిచ్చు రగిల్చింది.. ఏకంగా కన్న కొడుకునే బలితీసుకునే వరకు వెళ్లింది.. ఈ హృదయ విదారక ఘటనకు బట్టికండ్రిగ( నారాయణపురం) పంచాయతీ ఆదిఆంధ్ర వాడ మౌన సాక్ష్యంగా నిలిచింది. 


వడమాలపేట:
బట్టికండ్రిగ(నారాయణపురం) పంచాయతీ, ఆదిఆంధ్ర వాడకు చెందిన చెంగల్‌రాయుడు, లక్ష్మమ్మ కుమారుడు రమేష్‌ పుత్తూరులో డిగ్రీ పూర్తి చేశాడు. అదే గ్రామానికి చెందిన బుల్లయ్య, రమణమ్మ కుమార్తె ఐశ్వర్య తిరుపతిలోని ఓ కార్పొరేట్‌ కాలేజీలో ఇంటర్‌ చదివింది. ఒకే సామాజిక వర్గం, పైగా బంధుత్వం ఉండడంతో.. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. రెండేళ్ల అనంతరం ఇరు కుటుంబాల సమ్మతితో ఇద్దరూ ఒక్కటయ్యారు. ఓ ప్రయివేట్‌ కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ జంటకు భవనశ్రీ(9), మహేష్‌(7) సంతానం. పాప నాలుగో తరగతి చదువుతుండగా, బాబు రెండో తరగతి. సంసారం సాఫీగా సాగిపోతున్న తరుణంలో రమేష్‌ కళ్లను అనుమాన భూతం కమ్మేయగా.. తాగుడుకు బానిసయ్యాడు. ఐశ్వర్యను మానసికంగా, శారీరకంగా హింసించసాగాడు. ఒకానొక సమయంలో ఆమె ఈ బాధలు భరించలేక పోలీసులను ఆశ్రయించింది. వాళ్లు సర్దిచెప్పి పంపడం.. ఆ తర్వాత పలుమార్లు వేధింపులతో ఆ ఇద్దరి మధ్య దూరం పెరిగింది. 

భార్య కనిపించకపోవడంతో.. 
వారం రోజుల క్రితం రమేష్, ఐశ్వర్యల మధ్య చోటు చేసుకున్న గొడవలో ఆమె చేయి విరిగింది. నొప్పికి తాళలేక విషయాన్ని అదే ప్రాంతంలోని తల్లి ఇంటికి వెళ్లి చెప్పుకుంది. ఆమె కూతురిని ఓదార్చి పుత్తూరు సమీపంలోని ఈశలాపురంలో కట్టు కట్టించి ఇంటికి తీసుకెళ్లింది. ఎంతైనా భర్త, పిల్లల మీద ప్రేమ.. ఆదివారం తిరిగి మెట్టింటికి చేరుకుంది. అయితే సోమవారం ఉదయాన్నే రమేష్‌ ఫూటుగా మద్యం సేవించి ఇంకా వంట చేయలేదని చేయి చేసుకున్నాడు. తన చేయి విరిగిందని, నిదానంగా చేసి పెడతానని బతిమాలినా మద్యం మత్తు చెలరేగింది. విధిలేని పరిస్థితుల్లో కుమార్తెను తీసుకొని తిరిగి పుట్టింటికి వెళ్లింది. 


పోలీసులకు ఫిర్యాదుతో.. 

తన కుమార్తెను అల్లుడు తరచూ చితకబాదడాన్ని తట్టుకోలేకపోయిన ఐశ్వర్య తల్లి జరిగిన విషయాన్ని వడమాలపేట పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు రమేష్‌కు ఫోన్‌ చేసి స్టేషన్‌కు రావాలని పిలిచారు. ఉదయం భార్య వెళ్లినప్పటి నుంచి ఈ రోజు నిన్ను చంపుతానని కొడుకుపై ప్రతాపం చూపించిన రమేష్‌.. ఇదే సమయంలో పోలీసుల నుంచి ఫోన్‌ రావడంతో తన కుమారుడు ప్రాణాపాయంలో ఉన్నాడని అప్పటికప్పుడు పినాయిల్‌ తాపించాడు. ఆసుపత్రికి తీసుకెళ్తున్నానని చెప్పి పుత్తూరుకు చేరుకున్నాడు. అక్కడ ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించి ఇద్దరూ ఇంటికొచ్చారు. అప్పటికీ భార్య కనిపించకపోవడంతో స్కూటర్‌పై పిల్లాడితో కలిసి పెట్రోల్‌ బంకులో ఓ బాటిల్‌ పెట్రోల్‌ కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఇంటికి సమీపంలో నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే కుమారునిపై పెట్రోల్‌పోసి నిప్పంటించాడు. సమీప బంధువు నాగరాజు తేరుకొని తన లుంగీతో మంటలు ఆర్పేందుకు యత్నించాడు. ఇంతలో స్థానికులు తోడై మంటలను అదుపుచేసి 108లో బాలుడిని తిరుపతి రుయాకు తరలించారు. 

ప్రాణాప్రాయ స్థితిలో నాన్న కోసం.. 
భుజాలపై మోస్తూ.. బండిపై తిప్పుతూ.. అడిగిందల్లా కొనిస్తూ.. కోరిందల్లా తినిపిస్తూ ఎంతో ప్రేమ చూపించిన నాన్న, ఆ రోజు ఎందుకలా చేశాడో ఆ పసి హృదయానికి ఇప్పటికీ అర్థం కాలేదు. పినాయిల్‌ తాపించినా తాగేశాడు.. పెట్రోల్‌ పోసినా ఎందుకని అడగలేదు.. చివరకు నిప్పు పెట్టినా బెదరలేదు.. ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య ఇప్పటి కీ నాన్ననే కలవరిస్తున్నాడు. నాన్న కావాలి, ఎక్కడ ని రోదిస్తున్న తీరుతో ఆ తల్లి కన్నీటి పర్యంతమవుతోంది.

మెరుగైన చికిత్సకు మంత్రి రోజా ఆదేశం 
ఈ హృదయ విదారక ఘటనతో మంత్రి రోజా చలించిపోయారు. బాబు ఆరోగ్య పరిస్థితిపై రుయా వైద్యలతో ఆరా తీశారు. శరీరం బాగా కాలిపోయిందని, కొద్ది రోజులు గడిస్తే కాని ఏమీ చెప్పలేమనడంతో మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. మండల తహసీల్దార్‌ రోశయ్య కూడా బాధిత కుటుంబాన్ని ఆసుపత్రిలో పరామర్శించారు. ఘటన విషయమై ఎస్‌ఐ రామాంజనేయులు విలేకరులతో మాట్లాడుతూ రమేష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అతని మానసిక స్థితి బాగోలేదని, కేవలం భార్యపై అనుమానంతోనే ఇలా చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. 

మరిన్ని వార్తలు