అత్తవారింటిలో అల్లుడి మర్డర్‌.. తానే చేశానన్న భార్య.. విషయం వేరే అంటున్న బంధువులు

22 Jun, 2022 17:05 IST|Sakshi

శాలిగౌరారం (నల్గొండ): కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ భర్తను దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన శాలిగౌరారం మండలంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామానికి చెందిన ప్రస్తుత సర్పంచ్‌ మామిడికాయల జయమ్మ కుమార్తె సారికను నకిరేకల్‌ మండలం మండలాపురం గ్రామానికి చెందిన మాచర్ల కిరణ్‌(35)కు ఇచ్చి 2011లో వివాహం జరిపించారు. వీరికి కుమారుడు(10), కుమార్తె(7) ఉన్నారు. వివాహం జరిగినప్పటి నుంచి వీరు హైదరాబాద్‌లో జీవనం సాగిస్తున్నారు.

సారిక ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేయగా, కిరణ్‌ ఎమ్మార్పీఎస్‌ ఆర్గనైజేషన్‌లో పనిచేసేవాడు. ఈ క్రమంలో రోజురోజుకూ పోషణ ఖర్చులు పెరుగుతుండటంతో కుటుంబంలో ఆర్థిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఇద్దరి మధ్య నాలుగేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగం మానేసిన సారిక ఆరు నెలల క్రితం కుమారుడు, కుమార్తెను వెంటపెట్టుకొని చిత్తలూరులోని తల్లిగారింటికి వచ్చి ఇక్కడే ఉంటోంది. ఈ క్రమంలో పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు నిర్వహించారు. కానీ భార్యభర్తల మధ్య బేదాభిప్రాయాలు తగ్గకపోవడంతో విడివిడిగా ఉంటున్నారు. 
వ్యభిచార కూపాలు.. విచ్చలవిడిగా సాగుతున్న దందా

భర్తపై పోలీసులకు ఫిర్యాదు
ఈనేపథ్యంలో భర్త కాపురానికి తీసుకుపోవడంలేదని 20రోజుల క్రితం సారిక శాలిగౌరారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కిరణ్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిచి పోలీసులు భార్యాభర్తలకు కలిసి ఉండాలని కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించారు. అక్కడనుంచి కిరణ్‌ హైదరాబాద్‌కు పోగా, సారిక చిత్తలూరులో ఉంటోంది. ఈక్రమంలో సోమవారం మధ్యాహ్నం 3గంటలకు కిరణ్‌ చిత్తలూరు గ్రామానికి వచ్చాడు.

సాయంత్రం కిరణ్‌ మద్యం ఇంటికి తెప్పించుకొని తాగాడు. భోజనం తర్వాతా ఆర్థికపరమైన విషయాలతో దంపతుల మధ్య వాదనలు జరిగాయి. కొంతసమయం తర్వాత కిరణ్‌ ఇంట్లో నేలపై నిద్రించాడు. ఇదే అదునుగా భావించిన సారిక రాత్రి 11 గంటల సమయంలో నిద్రలో ఉన్న కిరణ్‌ తలపై బండరాయితో మోదడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే సారిక అక్కడనుంచి బయటకు వెళ్లి వంగమర్తిమీదుగా సూర్యాపేట జిల్లా అర్వపల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించి లొంగిపోయింది.

దీంతో అర్వపల్లి పోలీసులు సంఘటన గురించి శాలిగౌరారం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మంగళవారం హతుడి కుటుంబ సభ్యులు, బంధువులు చిత్తలూరుకు చేరుకోవడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. సంఘటన స్థలాన్ని సీఐ రాఘవరావు సందర్శించి మృతదేహాన్ని పరిశీలించారు. 

మృతదేహం తరలింపు అడ్డగింత
మాచర్ల కిరణ్‌ హత్యలో భార్య సారికతో పాటు మరికొంతమంది ప్రమేయం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పాటు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్నారు.  నిందితులను గుర్తించి కేసు నమోదుచేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమనిగింది.  మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మృతదేహాన్ని  నకిరేకల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హతుడి తమ్ముడు మాచర్ల కిశోర్‌ సారికతో పాటు మరో నలుగురి వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కిశోర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.

హత్యలో ఐదుగురి పాత్ర?
మాచర్ల కిరణ్‌ హత్యలో భార్య సారికతో పాటు మరో నలుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు హతుడి కుటింబికులు ఆరోపిస్తున్నారు. వారిలో సారికతో పాటూ చిత్తలూరుకు చెందిన ఆమె అక్క బండారు నాగమ్మ, ఆమె కుమారుడు బండారు శివప్రసాద్, యాదాద్రి భువనగిరిజిల్లా అడ్డగూడూరు మండలం వెల్దేవికి చెందిన ఓ వ్యక్తి, నకిరేకల్‌ మండలం నోముల గ్రామానికి చెందిన మరో వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందో! తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇద్దరు పిల్లలతో కలిసి..

మరిన్ని వార్తలు