నమ్మకం మాటున మోసం.. శ్రీశైలం వెళ్తున్నామంటూ..

5 Dec, 2021 07:46 IST|Sakshi
విచారిస్తున్న ఎస్‌ఐ వి. అజయ్‌బాబు

ఫిరంగిపురం(తాడికొండ): ఎన్నో ఏళ్లుగా చిట్టీ పాటలు నిర్వహిస్తూ నమ్మకం మాటున   తమను మోసం చేసి రూ.2 కోట్ల 5 లక్షలతో ఓ కుటుంబం పరారయ్యిందని ఫిరంగిపురం మండలం పొనుగుపాడు వాసులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో నిడమానూరి భీమేశ్వరరావు, సుబ్బాయమ్మ దంపతులు కిరాణ, బట్టల కొట్టు, మందుల షాపు  నిర్వహిస్తున్నారు. కొన్నేళ్లుగా చిట్టీపాటలు నిర్వహిస్తూ గ్రామంలో మంచి వారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. ఆడపిల్లలకు వివాహాలు కాగా అబ్బాయి శివప్రసాద్‌ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగం చేస్తున్నాడు.

చదవండి: Chandrababu: ప్రజలకు బుద్ధి, జ్ఞానం లేదు 

రెండేళ్ల కిందట కరోనా ప్రభావంతో వర్క్‌ఫ్రం హోంలో భాగంగా శివప్రసాద్‌ ఇంటికి చేరాడు.  గ్రామంలోని వారికి తన బ్యాంకు అకౌంట్‌ నంబర్‌ను ఇచ్చి వారిచేత తన అకౌంట్‌లో చిట్టీల డబ్బు వేయిస్తూ వస్తున్నాడు. అయితే శుక్రవారం సాయంత్రం శ్రీశైలం వెళుతున్నామంటూ చెప్పి ఇంటికి తాళాలు వేసి వెళ్లిన భీమేశ్వరరావు, సుబ్బాయమ్మ, కొడుకు శివప్రసాద్‌ ఫోన్లు, వాట్సాప్‌ నంబర్లతో సహా బ్లాక్‌లో పెట్టడంతో.. ఫోన్‌ చేసిన వారికి స్విచ్చాఫ్‌ అని వచ్చింది. ఉద్దేశపూర్వకంగానే భీమేశ్వరరావు దంపతులు చిట్టీల పేరుతో డబ్బు వసూలు చేసి పరారయ్యారని భావించిన 48 మంది బాధితులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  నిందితులు రూ.2 కోట్ల 5 లక్షలతో పరారయ్యారని బాధితులు ఫిర్యాదు చేశారని,  మరికొందరు బాధితులున్నట్లు సమాచారం ఉందని ఎస్‌ఐ అజయ్‌బాబు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు