చిదిమేసిన నష్టాల చీడ

13 Dec, 2021 03:17 IST|Sakshi

మిర్చి పంటకు చీడ పీడలు 

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

మహబూబాబాద్‌ రూరల్‌: మిర్చి పంటను చీడపీడలు ఆశించాయి. మొక్కలన్నీ పనికి రాకుండా పోతున్నాయి. పంటను రక్షించుకునే పరిస్థితి లేక.. చేసిన అప్పులెలా తీర్చాలని మథనపడుతూ మహబూబాబాద్‌ జిల్లా రోటిబండతండా పరిధిలోని దూదియా తండాకు చెందిన రైతు ఆంగోతు బిక్కు (47) ఆదివారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. తండాకు చెందిన బిక్కు ఎకరంన్నర మేర మిరప, అరెకరంలో వరి పంట సాగు చేశాడు.

వరి దిగుబడి అంతంతమాత్రం రాగా.. మిరప చేనుకు ఎక్కువ మొత్తంలో తామర, నల్లి పురుగులు ఆశించడంతో మొక్కలు కూడా పనికి రాకుండా పోయాయి. పంట పెట్టుబడి కోసం రూ.2 లక్షలు అప్పు చేశాడు. పాడైన పంటను చూసి.. అప్పు ఎలా తీర్చాలని ఆందోళన చెందుతున్న బిక్కు.. భార్య ఇంట్లో లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్‌ఐ సీహెచ్‌.అరుణ్‌కుమార్‌ తెలిపారు. కాగా.. మృతదేహాన్ని మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించి శవపరీక్ష అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

మరిన్ని వార్తలు