టీడీపీ నేతల వేధింపులు.. సెల్ఫీ వీడియో తీసుకుని రైతు ఆత్మహత్య

9 May, 2022 07:36 IST|Sakshi

కనగానపల్లి(శ్రీ సత్యసాయి జిల్లా): టీడీపీ నాయకుల వేధింపులు తాళలేక వైఎస్సార్‌సీపీ కార్యకర్త దండు దామోదర్‌రెడ్డి (48) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం రాంపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. గ్రామంలోని గోసా రామస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని గత ఏడాది జనవరి 4న గ్రామపెద్దల సమక్షంలో లెక్కించారు. రూ.1,47,083 ఆదాయం రాగా.. ఆ మొత్తాన్ని గ్రామ కమిటీ సభ్యుడైన దామోదర్‌రెడ్డికి అప్పగించారు.
చదవండి: ప్రేమ పేరుతో ఎస్‌ఐ వంచన

తర్వాత ఆ డబ్బు గురించి చిన్న గొడవ జరగ్గా పోలీసులు గ్రామ పెద్దలను స్టేషన్‌కు పిలిపించి డబ్బు తీసుకోవాలని చెప్పారు. కానీ ఎవరూ ముందుకు రాలేదు. తర్వాత ఎవరూ డబ్బు గురించి అడగకపోవటంతో దామోదర్‌రెడ్డి కొంత మొత్తాన్ని వాడుకున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌ 1న గ్రామ పెద్దలు సమావేశమై డబ్బు గురించి అడగ్గా కొంత గడువిస్తే డబ్బంతా ఇచ్చేస్తానని చెప్పాడు. అయితే.. స్థానిక టీడీపీ నాయకులు అతనితో గొడవ పడటంతోపాటు ఆ డబ్బు పేరుతో  వేధించసాగారు.

దీంతో మానసిక వేదనకు గురైన దామోదర్‌రెడ్డి శనివారం సాయంత్రం తన పొలం దగ్గర సెల్ఫీ వీడియోలో టీడీపీ నాయకుల వేధింపులు, కుటుంబ ఆర్థిక పరిస్థితుల్ని వివరిస్తూ పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు, మృతుడి సెల్ఫీ వీడియో వాంగ్మూలం ఆధారంగా టీడీపీ నాయకులు ఎస్‌.వెంకట రాముడు, వడ్డే నాగభూషణ, రామాంజినేయులు, ముత్యాలప్ప, నారాయణపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు. 

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు