రైతు ఉసురు తీసిన పంట తెగుళ్లు 

23 Nov, 2021 02:39 IST|Sakshi

మిర్చి పంట దెబ్బతినడంతో ఆత్మహత్య  

తల్లాడ: ఆరుగాలం కష్టపడి పండించిన మిర్చి పంట కళ్లముందే తెగుళ్ల కారణంగా నాశనం అవుతుంటే ఆ రైతు తట్టుకోలేకపోయాడు. గత ఏడాది చేసిన అప్పులు రూ.5 లక్షలకు తోడు ఈ సారి మరో రూ.5 లక్షల అప్పు తోడు కావడంతో ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం బాలపేటకు చెందిన పులి వెంకట్రామయ్య(40) తనకు ఉన్న ఎకరంతో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి సాగు చేశాడు.

మూడు నెలల కిందట నాటిన పైరు పిందె దశకు రాగా.. వైరస్‌తో పాటు గుబ్బముడత, ఎర్రనల్లి తెగులు సోకింది. దీంతో పైరు పూర్తిగా దెబ్బతినడంతో తట్టుకోలేకపోయాడు. పంటల పెట్టుబడికోసం చేసిన రూ.10 లక్షల అప్పు తీర్చే మార్గం కానరాలేదు. అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి చేయడంతో ఆదివారం తన జత ఎడ్లను రూ.50 వేలకు విక్రయించాడు.

అయినా మిగతా అప్పు ఎలా తీర్చాలో తెలియక సోమవారం తెల్లవారుజామున ఇంటి వెనకాల రేకుల షెడ్డులో ఉరి వేసుకున్నాడు. మృతుడికి భార్య జ్యోతితో పాటు ఇంటర్‌ చదువుతున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. తల్లాడ తహసీల్దార్‌ గంటా శ్రీలత, ఏఓ ఎం.డీ.తాజుద్దీన్, ఎస్సై సురేశ్‌ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి వివరాలు ఆరా తీశారు.  

మరిన్ని వార్తలు