పంట నష్టంతో రైతు ఆత్మహత్య

29 Aug, 2022 02:17 IST|Sakshi
జాదవ్‌ భోజారాం 

నర్సాపూర్‌(జి): భారీ వర్షాలకు పత్తి పంట పూర్తిగా తుడిచి పెట్టుకుపోవడంతో మనస్తాపం చెందిన ఒక రైతు వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్మల్‌ జిల్లాలో జరిగిన ఈ సంఘటనపై పోలీసులు, రైతు కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. నర్సాపూర్‌(జి) మండలం బూరుగుపల్లి(కే) గ్రామానికి చెందిన జాదవ్‌ భోజారాం (48)కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తనకున్న రెండెకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

అప్పులు చేసి ఇద్దరు కుమార్తెల పెళ్లి చేశాడు. వ్యవసాయం కోసం కొంత అప్పు చేశాడు. వానాకాలంలో పత్తి పంట సాగుకు రూ.25 వేలు పెట్టుబడి పెట్టాడు. ఈ క్రమంలో గత నెలలో కురిసిన భారీ వర్షాలకు పంట పూర్తిగా కొట్టుకుపోయింది. రూ.5 లక్షల వరకు చేసిన అప్పు ఎలా తీర్చాలని కొన్ని రోజులుగా మనస్తాపం చెందుతున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

అర్లి(కే) సమీపంలోని సుద్దవాగు వంతెనపై చెప్పులు, సెల్‌ఫోన్‌ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వాగులో గాలించగా ఆదివారం భోజారాం మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుని భార్య జాదవ్‌ లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నర్సాపూర్‌(జి) ఎస్‌ఐ గీత తెలిపారు.

మరిన్ని వార్తలు