Fast Coin Loan App Harassment: న్యూడ్‌ ఫొటోలు పంపుతామని బెదిరించారు.. తెల్లారి అన్నంత పనీ చేసేశారు

6 May, 2022 07:29 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

ఆగని ఫాస్ట్‌ కాయిన్‌ లోన్‌ యాప్‌ వేధింపులు 

ఫొటోలు మార్ఫింగ్‌ చేసి కుటుంబ సభ్యులకు ఫార్వర్డ్‌ 

నార్సింగి పీఎస్‌లో బాధితురాలి ఫిర్యాదు  

సైబరాబాద్‌లో మళ్లీ మొదలైన లోన్‌ యాప్‌ వేధింపులు 

నాలుగు నెలల్లో 60 కేసులు నమోదు 

సాక్షి, హైదరాబాద్‌:  ‘వనిత’ (పేరు మార్చాం) ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగిని. వ్యక్తిగత అవసరాల కోసం ఫాస్ట్‌ కాయిన్‌ అనే లోన్‌ యాప్‌లో రూ.18 వేలు రుణం తీసుకుంది. నెల రోజుల తర్వాత చక్రవడ్డీ కలుపుకొని రూ.25 వేలు చెల్లించింది. కానీ, యాప్‌లో మాత్రం పేమెంట్‌ జరిగినట్లు చూపించలేదు. తెల్లారి ఆమెకు యాప్‌ కాల్‌ సెంటర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది ‘మీరింకా లోన్‌ కట్టలేదని, త్వరగా చెల్లించకపోతే మీ న్యూడ్‌ ఫొటోలను మీ కుటుంబీకులకు పంపిస్తామని’ బెదిరించారు. తెల్లారి అన్నంత పనీ చేసేశారు. దీంతో బాధితురాలు వెంటనే యాప్‌లో రూ.25 వేలు చెల్లించింది. ఇలా పలుమార్లు నిర్వాహకుల బెదిరింపులతో రూ. 2 లక్షలపైనే చెల్లించినా.. వదలకపోవటంతో  బాధితురాలు నార్సింగి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. 

సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో లోన్‌ యాప్‌ వేధింపులు మళ్లీ మొదలయ్యాయి. వరుస అరెస్ట్‌లు, యాప్‌ బ్యాన్‌లతో ఏడాది పాటు కార్యకలాపాలకు దూరంగా ఉన్న లోన్‌ యాప్‌ నిర్వాహకులు మళ్లీ పంజా విసురుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు సైబరాబాద్‌ పరిధిలోని వివిధ పోలీసు స్టేషన్లలో 60కి పైగా లోన్‌ యాప్‌ వేధింపుల కేసులు నమోదు కావడమే ఇందుకు నిదర్శనం.  

చదవండి: (ఆఖరుసారిగా బన్నీతో గడుపుతానంటూ.. ఏకాంతంగా ఉండగా..)

ఢిల్లీ, బెంగళూర్ల నుంచి నిర్వహణ 
లోన్‌ యాప్‌ యజమానులు చైనాలో ఉంటారు. కానీ బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాలలో కాల్‌ సెంటర్లను ఏర్పాటు చేసి ఆపరేట్‌ చేయిస్తుంటారని సైబర్‌ క్రైమ్స్‌ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నెలకు రూ.10 వేలు, రూ.15 వేలు వేతనం ఇస్తూ.. వారితో బాధితులు, వారి కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్న వారికి అసభ్య మెసేజ్‌లు పంపిస్తూ బెదిరింపులకు పాల్పడుతుంటారని వివరించారు. కాల్‌ సెంటర్‌ ఉద్యోగులను కూడా అరెస్ట్‌ చేస్తున్నామని, ఇటీవలే చంఢీఘడ్‌లోని అక్రమ కాల్‌ సెంటర్‌ నిర్వాహకులను అరెస్ట్‌ చేసి. జైలుకు పంపించామన్నారు. లోన్‌ యాప్‌ బాధితుల్లో 10 శాతం వరకు మహిళలు ఉన్నట్లు తెలిపారు. రుణ గ్రహీతలు పురుషులైతే వాళ్ల కాంటాక్ట్‌ లిస్ట్‌లోని ఆడవాళ్ల ఫొటోలను మార్ఫింగ్‌ చేసి బెదిరిస్తుంటారన్నారు. 

600 పైగా చట్టవిరుద్ధ లోన్‌ యాప్స్‌.. 
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో 1,100లకు పైగా ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌లు ఉన్నాయి. వీటిలో 600 యాప్స్‌ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలను సాగిస్తున్నాయని వెల్లడించింది. ఫాస్ట్‌ కాయిన్, రిచ్‌క్యాష్, క్విక్‌ క్యాష్, సూపర్‌ వాలెట్, లక్కీ వాలెట్, స్పీడ్‌ లోన్, హ్యాపీ వాలెట్, క్యాష్‌ ఫిష్, రూపియా బస్, లైవ్‌ క్యాష్, బెస్ట్‌ పైసా, రూపియా స్మార్ట్, రూపీ బాక్స్, లోన్‌ క్యూబ్, క్రెడిట్‌ బాక్స్‌ వంటివి ప్రముఖమైనవి. ఆయా యాప్స్‌ను బ్యాన్‌ చేయాలని గూగుల్‌కు లేఖ రాసింది.  

మరిన్ని వార్తలు