తండ్రి బాధ్యతగా లేడని..

24 May, 2022 11:40 IST|Sakshi

టెక్కలి రూరల్‌ : తండ్రి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం, నిత్యం తాగి వచ్చి గొడవలు పడటంతో విసిగిపోయిన కుమారుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన కోటబొమ్మాళి మండలం ప్రకాష్‌నగర్‌ కాలనీలోచోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాష్‌నగర్‌ కాలనీకి చెందిన కాశి సాయికుమార్‌ (20) డిగ్రీ వరకు చదివాడు. తండ్రి గోవిందరావు మద్యానికి బానిస కావడం, ఆదాయం అంతంత మాత్రం కావడం, కుటుంబపోషణ భారం కావడంతో సాయి చదువును మధ్యలో ఆపేసి అప్పు చేసి ఆటో కొన్నాడు.

అయినా తండ్రి బాధ్యత లేకుండా తాగి వస్తూ నిత్యం వీధుల్లో కేకలు పెడుతూ పరువు పోగొడుతున్నాడంటూ తండ్రీకొడుకులు ఆదివారం రాత్రి గొడవపడ్డారు. మనస్థాపానికి గురైన సాయి రాత్రి ఒంటి గంట వరకు తన తల్లితో మాట్లాడి.. తల్లి నిద్రలోకి వెళ్లాక చీరను పట్టుకొని సమీపంలో ఉన్న ఎంపీపీ పాఠశాల (బీసీ మోడల్‌ స్కూల్‌) మధ్యాహ్న భోజన పథకం వంటషెడ్‌లోకి వెళ్లాడు. అక్కడ దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం అదే దారిలో వెళ్లిన వారికి షెడ్‌లో వేలాడుతున్న సాయిని గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ వై.రవికుమార్, క్లూస్‌టీం సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

(చదవండి: కలెక్టర్‌, జేసి సంతకాల ఫోర్జరీ కేసు: తీగ లాగితే కదులుతున్న డొంక)

మరిన్ని వార్తలు