తండ్రి, కుమార్తెను బలిగొన్న వాటర్‌ హీటర్‌ 

3 Feb, 2023 05:06 IST|Sakshi
ఇప్పిలి సింహాచలం (ఫైల్‌), పసుపులేటి మంగమ్మ (ఫైల్‌)

మరో మహిళకు తప్పిన ప్రాణాపాయం 

విజయవాడ సత్యనారాయణపురంలో ఘటన 

సత్యనారాయణపురం (విజయవాడ సెంట్రల్‌): భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటున్న కూతురు, మనవళ్లకు అన్నీ తానై చూసుకుంటున్నాడు ఆ పెద్దాయన. విధి చిన్నచూపు చూడటంతో విద్యుదాఘాతానికి గురై తండ్రి, ఆయనను కాపాడే ప్రయత్నంలో కుమార్తె మృత్యువాత పడ్డారు. పదేళ్లు వయసు నిండని ఇద్దరు బిడ్డలను అనాథల్ని చేసి వెళ్లిపోయారు. ఈ హృదయ విదారక ఘటన సత్యనారాయణపురంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది.

రామకోటి మైదానం పాపిట్లవారివీధిలో నివాసం ఉంటున్న  ఇప్పిలి సింహాచలం (60) పెయింటింగ్‌ పనులు చేసుకుంటూ భార్య వరాలమ్మతో కలసి పాత రేకుల షెడ్డులో నివాసం ఉంటున్నారు. అతని కుమార్తె పసుపులేటి మంగమ్మ (32) భర్తతో విభేదాల కారణంగా 6, 9 ఏళ్ల కుమారులతో కలసి పుట్టింట్లోనే ఉంటుంది. వారు సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో 1, 3వ తరగతి చదువుతున్నారు. సింహాచలానికి ఆరోగ్యం సహకరించకపోవడంతో కొంతకాలంగా పనికి వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు.  

భార్య వరాలమ్మ, కూతురు మంగమ్మ ఇళ్లలో పనులు, సాయంత్రం సమయంలో ఫుడ్‌కోర్డులో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గురువారం సాయంత్రం 6.30 గంటల సమయంలో మంగమ్మ తన ఇద్దరు పిల్లలకు స్నానం చేయించి ఇంటి సమీపంలోని ట్యూషన్‌కు పంపించింది. సింహాచలం కూడా స్నానం చేసే నిమిత్తం వేడినీళ్లు కాచుకోవడానికి ప్లాస్టిక్‌ బకెట్‌లో వాటర్‌ హీటర్‌ పెట్టి స్విచ్‌ వేశాడు.

ఆ సమయంలో విద్యుత్‌షాక్‌ తగిలి కిందపడిపోయాడు. కాపాడే ప్రయత్నంలో కూతురు మంగమ్మ తండ్రిని పట్టుకోవడంతో ఆమెకు విద్యుత్‌ షాక్‌ తగిలి ఇద్దరూ మృత్యువాత పడ్డారు. వారిని కాపాడే క్రమంలో పక్క పోర్షన్‌లో ఉండే అక్కవరపు సీత(54)కు విద్యుత్‌ షాక్‌ తగిలి తీవ్ర గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. భర్త, కూతురు మృతి చెందటంతో ఆమె ఇద్దరు పిల్లలను చూసుకుని తల్లి వరాలమ్మ కుమిలిపోవడం స్థానికుల కలచివేసింది. సత్యనారాయణపురం సీఐ వెంకటనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

మరిన్ని వార్తలు