తండ్రీ కొడుకులూ మిగల్లేదు..

4 Jan, 2021 08:41 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఏలేరు కాలువలో మృతదేహాలు లభ్యం

గత నెల 22న అదే కాలువలో శవాలై తేలిన భార్య, కూతురు

పప్పుల చీటీలే కొంపముంచాయా?

సాక్షి, అనకాపల్లి, మాకవరపాలెం: భయపడినంతా జరిగింది.. తల్లీకూతుళ్లే కాదు.. తండ్రీ కొడుకులు కూడా విగతజీవులుగా మిగలడం అందరినీ కలచివేసింది. ఇన్నాళ్లూ కన్నులపండువగా కనిపించిన కుటుంబం కాసుల కారణంగా కనుమరుగైంది. అనకాపల్లి మండలంలోని బీఆర్టీ కాలనీలో పప్పుల చీటీలు నిర్వహించే పన్నెల గోపాలకృష్ణ భార్య ఉమాదేవి(38), కుమార్తె జాహ్నవి(10) మృతదేహాలు గత నెల 22న కశింకోట మండలం లచ్చర్ల వద్ద ఏలేరు కాలువలో లభ్యమైన విషయం తెలిసిందే. అప్పటికే గోపాలకృష్ణ(42), అతని కుమారుడు రోహిత్‌(8) ప్రసాద్‌లు కనిపించకపోవడంతో అందరూ పలు రకాలుగా ఊహించుకున్నారు. వారిద్దరు కూడా మరణించి వుంటారన్నది ఒక కథనం కాగా.. వారైనా తిరిగివస్తే బాగుణ్నని సన్నిహితుల ఆశ.. సుమారు 12 రోజుల తర్వాత మాకవరపాలెం మండలంలోని ఏలేరు కాలువలో ఆదివారం రెండు మృతదేహాలను గుర్తించారు. ఇవి గోపాలకృష్ణ, అతని కొడుకు రోహిత్‌లవేనని ఎస్‌ఐ కరక రాము నిర్థారించారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

బీఆర్టీ కాలనీలో విషాదం
బీఆర్టీ కాలనీవాసుల గుండె బరువెక్కింది. ఏమిటింత దారుణం... ప్రాణాలు తీసుకోవాల్సినంత దయనీయ స్థితికి ఎందుకెళ్లారు...? కను‘పాప’లను సైతం చిదిమేసుకోవాల్సిన పరిస్థితికి కారణమేంటి..? పిల్లల్నైనా వదిలేసి ఉంటే బాగుండు కదా..? అందరూ ఇలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోపాలకృష్ణ కుటుంబం పదేళ్ల నుంచి ఇక్కడే నివసిస్తోంది. భార్యభర్తలిద్దరూ పప్పుల చీటీలు వేసే వారని అక్కడి వారిచ్చిన సమాచారం. సంక్రాంతి వస్తున్న నేపథ్యంలో సరకులు ఇవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తలకు మించిన ఆర్థిక భారంతో దంపతులిద్దరూ ఈ దారుణమైన నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు. గోపాలకృష్ణ, ఉమాదేవితో సహా పిల్లలు గత నెల 20న బలిఘట్టం వైపు వెళ్లారు.

22న భార్య ఉమాదేవి, కుమార్తె జాహ్నవిలు కశింకోట మండలం అడ్డాంకు సమీపంలో ఏలేరు కాలువలో విగత జీవులుగా కనిపించారు. ముందు ఇది హత్యేనన్న అనుమానంతో అలజడి రేగింది. ఈ కోణాన్ని పరిగణనలోకి తీసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించినప్పటికీ కుటుంబం మొత్తం ఇంటి నుంచి వెళ్లిపోయిందన్న సమాచారం మేరకు భర్త గోపాలకృష్ణ, కుమారుడు రోహిత్‌ ప్రసాద్‌లు కనిపించకపోవడంతో అందరి మదిలో అనేక ప్రశ్నలు ఉదయించాయి. పోలీసులు ఏలేరు కాలువ పరిధిలో 25 కిలోమీటర్ల మేరకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందంతో వెతికించినా ఫలితం దక్కలేదు. దీంతో మృతురాలి భర్త, కుమారుడు బతికే ఉంటారని అంతా భావించారు. అయితే ఆ ఆశ కూడా అడియాసగానే మారింది. 

అప్పుల వల్లే ఆత్మహత్యలు 
మాకవరపాలెం పరిసరాల్లో బైక్‌ కనిపించందని రైతు ఇచ్చిన సమాచారం మేరకు రెండు కిలోమీటర్ల పరిధిలో పోలీసులు వెతికారు. చివరకు మాకవరపాలెం మండలం పైడిపాలెం సమీపంలో గోపాలకృష్ణ, రోహిత్‌లు విగతజీవులుగా కనిపించడంతో విషాదం మిగిలింది. అప్పుల వల్లే గోపాలకృష్ణ, ఉమాదేవి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని ప్రాథమికంగా భావిస్తున్నామని సీఐ భాస్కర్‌ చెప్పారు. ఇందులో హత్య కోణం లేదన్నారు. సంక్రాంతి సమీంచడంతో పప్పుల చీటీల సొమ్ము డిమాండ్‌ చేస్తారన్న భయంతో వారు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారన్నారు. రెండు బృందాలుగా గోపాలకృష్ణ, ప్రసాద్‌ల కోసం ఆరా తీశామని, మృతదేహాలు ఏలేరు కాలువలో కనిపించాయన్నారు. (చదవండి: పక్కింటి అమ్మాయిని చూశాడని..)

మరిన్ని వార్తలు