ఉపాధినిచ్చే వల ఉసురు తీసింది 

13 Sep, 2020 08:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చేపల వేటకు వెళ్లిన తండ్రీ కుమారుడు జల సమాధి 

బిడ్డను కాపాడబోయిన తండ్రి కూడా మృతి 

కాలువలో మునిగి విగతజీవులైన వైనం 

చినగంజాం మండలం బాపయ్యనగర్‌లో విషాదం

చినగంజాం(ప్రకాశం జిల్లా): చేపల వేటకు వెళ్లిన తండ్రీకొడుకులను కాలువ బలి తీసుకుంది. ఉపాధినిచ్చే వలే వారిని చుట్టేసి ప్రాణాలు తీసింది. నాన్నా.. మునిగిపోతున్నా కాపాడమంటూ కేకలు వేస్తున్న బిడ్డను చూసి నీటిలో దూకిన తండ్రి కూడా జలదిలోనే కలిసిపోయాడు. భర్త, బిడ్డను పోగొట్టుకుని గుండెలు బాదుకుంటున్న ఆ ఇల్లాలిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. ఈ విషాదకర ఘటన చినగంజాం మండలంలోని మత్స్యకార గ్రామంలో శనివారం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్లెపాలెం పంచాయతీ పరిధిలో బాపయ్యనగర్‌కు చెందిన ఐలా జోగియ్య(40), విజయ దంపతులకు ఇద్దరు బిడ్డలు. కుమారుడు రామ్‌చరణ్‌ (13) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. కుమార్తె హారిక 3వ తరగతి చదువుతోంది. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో జోగియ్య తన కుమారుడిని వెంటబెట్టుకొని సముద్రం తీరంలోని కాలువలో చేపల వేటకు వెళ్లాడు.

వలను సమీపంలోని కాలువలో బోటుకు అమర్చి, ఆదివారం ఉదయం అందులో పడిన మత్స్య సంపదను ఇంటికి తీసుకెళ్లాలని భావించారు. కర్ర తెప్పపై వెళ్తూ వలను కాలువలో అమరుస్తుండగా రామచరణ్‌ బోటు నుంచి ప్రమాదవశాత్తు జారి కాలువలో పడ్డాడు. లోతు ఎక్కువగా ఉండటంతో ఈదలేక నాన్నా.. నాన్నా.. అంటూ పెద్దగా కేకలు వేశాడు. వల సరిచేస్తున్న జోగియ్య మునిగిపోతున్న బిడ్డను కాపాడుకోవాలనే ప్రయత్నంలో చేతిలో ఉన్న వలతో సహా నీటిలో దూకేశాడు. అతడి చేతిలో ఉన్న వల ఇద్దరినీ కమ్మేయడంతో నీటి నుంచి బయటకు రాలేకపోయారు. సమీపంలో వేట చేసుకునే మత్స్యకారులు వచ్చి రక్షించేలోగా ప్రాణాలు వారు కోల్పోయారు. మృతదేహాలను ఒడ్డుకు చేర్చేందుకు సుమారు 2 కి.మీ దూరం తెప్పలోనే ప్రయాణించాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న ఏఎస్‌ఐ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం చీరాల వైద్యశాలకు తరలించారు. తండ్రీ కుమారుడి మృతితో బాపయ్యనగర్‌లో తీవ్ర విషాదం నెలకొంది.  

మరిన్ని వార్తలు