విషాదం: నాన్నా... ఇది తగునా !..

5 Jun, 2021 11:38 IST|Sakshi

పిల్లలకు పురుగుల మందు ఇచ్చి తానూ తనువు చాలించిన తండ్రి

నాలుగేళ్లుగా భార్యతో స్పర్థలు

వేర్వేరుగా ఉంటున్న దంపతులు

విచ్ఛిన్నమైన కుటుంబం

మలికిపురం(తూర్పుగోదావరి): ఇద్దరు చిన్నారులకు పురుగు మందు ఇచ్చి తండ్రి కూడా తాగి మృతి చెందిన సంఘటన మలికిపురం మండలం దిండిలో  శుక్రవారం జరిగింది. పి.గన్నవరం మండలం నాగుల్లంకశివారు కందాలపాలెంకు చెందిన సవరపు విశ్వనాథం(36)కు పదేళ్ల క్రితం ఊడిమూడి పెదపేటకు చెందిన ఆదిలక్ష్మితో వివాహం జరిగింది. ఈ దంపతులకు కుమారుడు రేవంత్‌(10), కుమార్తె జస్సీకా(9 ) ఉన్నారు. భార్యాభర్తల మధ్య స్పర్థల కారణంగా నాలుగేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. వీరి  వివాదం కోర్టులో నడుస్తోంది. భార్యాభర్తలను కలిపేందుకు పెద్దలు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. వివాదాలు మరింత పెరిగాయి.

ఈ పరిస్థితుల్లో శుక్రవారం విశ్వనాథం తన కుమార్తె, కుమారుడుతో కలసి ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. పిల్లల్ని తీసుకుని దిండి ఇసుక ర్యాంపు వద్దకు చేరుకున్నారు. ఇద్దరు చిన్నారులకు శీతల పానీయంలో పురుగుల మందు కలిపి తాగించాడు. తర్వాత విశ్వనాథం కూడా తాగినట్లు పోలీసులు భావిన్నారు. విశ్వనాథం వెంటనే చనిపోయాడు. చిన్నారులు  అపస్మారక స్థితిలో ఉన్నారు. గమనించిన స్థానికులు వెంటనే మలికిపురం పోలీసులకు తెలియజేశారు. ఎస్సై ఎం.నాగరాజు తన సిబ్బందితో చేరుకున్నారు. కొన ఊపిరితోఉన్న చిన్నారులను ఆస్పత్రులకు తరలించారు. చిన్నారులు ఇద్దరు రాజోలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

చదవండి: దారుణం: భార్య చేతిలో భర్త హతం 
‘గారాల పట్టి.. మేము ఎలా బతికేది తల్లీ’

మరిన్ని వార్తలు