అగ్ని ప్రమాదానికి కుటుంబం బలి

26 Sep, 2022 04:43 IST|Sakshi
అగ్నిప్రమాదంతో మంటలు వ్యాపించిన భవనం, మృతులు రవిశంకర్‌రెడ్డి, పిల్లలు సిద్ధార్థ్ రెడ్డి, కార్తిక

తండ్రి, ఇద్దరు పిల్లలు దుర్మరణం

ప్రాణాలతో బయటపడిన మృతుని భార్య, తల్లి 

ఇంట్లో నిద్రిస్తుండగా గ్యాస్‌ లీక్‌.. 

విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు

తిరుపతి జిల్లా రేణిగుంటలో ఘటన  

రేణిగుంట: అగ్నిప్రమాదం ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఓ తండ్రి, ఇద్దరు పిల్లలు నిద్రలోనే అగ్నికి ఆహుతవ్వగా.. తల్లి ఏకాకిగా మారిపోయింది. తిరుపతి జిల్లా రేణిగుంటలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రేణిగుంట డీఎస్పీ రామచంద్ర తెలిపిన వివరాలు.. వైఎస్సార్‌ జిల్లా పాటూరుకు చెందిన డాక్టర్‌ ఎం.రవిశంకర్‌రెడ్డి(47), గుంటూరుకు చెందిన డాక్టర్‌ అనంతలక్ష్మికి సిద్దార్థ్‌రెడ్డి (14), కార్తీక (10) అనే ఇద్దరు పిల్లలున్నారు.

వీరు ఏడాదిన్నర కిందట రేణిగుంటలోని బిస్మిల్లానగర్‌లో రెండంతస్తుల ఇల్లు నిర్మించుకుని.. కింద ఫ్లోర్‌లో క్లినిక్‌ నిర్వహిస్తున్నారు. రవిశంకర్‌రెడ్డి తిరుపతిలోని డీబీఆర్‌ ఆస్పత్రిలో రేడియాలజిస్ట్‌గా పనిచేస్తున్నాడు. రవిశంకర్‌రెడ్డి తల్లి రామసుబ్బమ్మ కూడా వీరితోనే నివసిస్తోంది. శనివారం రాత్రి మొదటి అంతస్తులోని బెడ్రూమ్‌లో రామసుబ్బమ్మ, 2వ అంతస్తులోని ఓ గదిలో ఇద్దరు పిల్లలతో అనంతలక్ష్మి, మరో గదిలో ఆమె భర్త రవిశంకర్‌రెడ్డి నిద్రపోయారు.

తెల్లవారుజామున 4 గంటల సమయంలో 2వ అంతస్తులోని వంటగది నుంచి మంటలు వ్యాపించడాన్ని గమనించిన వాచ్‌మెన్‌ కేకలు వేస్తూ తలుపులు బాదాడు. అనంతలక్ష్మి తలుపు తీసి బయటకు రాగా.. అప్పటికే మంటలు దట్టంగా కమ్మేశాయి. దీంతో ఆమె ప్రాణభయంతో కిందకు పరుగు తీసింది. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు.

వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మొదటి అంతస్తులో ఉన్న రామసుబ్బమ్మను కిటికీ అద్దాలు పగలగొట్టి.. జేసీబీ సాయంతో సురక్షితంగా తీసుకొచ్చారు. 2వ అంతస్తులో ఉన్న పిల్లలను అతికష్టం మీద బయటకు తీసుకురాగా.. అప్పటికే వారు మృతి చెందారు. మరో గదిలో నిద్రించిన డాక్టర్‌ రవిశంకర్‌రెడ్డి పూర్తిగా కాలిపోయి మరణించాడు.

ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు,  శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆయన కుమార్తె పవిత్రారెడ్డి ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతలక్ష్మిని ఎమ్మెల్యే పరామర్శించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలకు తరలించినట్లు గాజులమండ్యం పోలీసులు తెలిపారు. గ్యాస్‌ లీకై.. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. 

మరిన్ని వార్తలు