కన్నతండ్రే కాలయముడు.. ఆస్తిలో వాటా..

24 Aug, 2021 07:58 IST|Sakshi

యువకుడి హత్య కేసులో నిందితుల అరెస్ట్‌

కేవీపల్లె: ఆస్తిలో వాటా అడగాడని కుమారుడిని కన్నతండ్రే హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ నెల 16వ తేదీన మండలంలోని రెడ్డివారిపల్లెలో జరిగిన యువకుడి హత్య కేసులో నలుగురు నిందితులను సోమవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి వివరాలను తెలిపారు. ఆయన కథనం మేరకు.. కేవీపల్లె మండలం తువ్వపల్లె పంచాయతీ రెడ్డివారిపల్లెకు చెందిన చిన్నకోట్ల జయరామ్‌ మొదటి భార్య కుమారుడు గిరిబాబు అలియాస్‌ రవి(21) మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీ వెంకటేశ్వపురంలో నివసిస్తున్నాడు. ఆస్తిలో వాటా కోసం తండ్రి జయరామ్‌తో రవి తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో రవి అడ్డుతొలగించుకోవాలని భావించిన జయరామ్‌ రూ.9లక్షలకు కిరాయి హంతకులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వారు పథకం ప్రకారం రవిని హత్య చేశారు.

చదవండి: డూప్లి ‘కేటు’ హోంగార్డులు!

దీనిపై జయరామ్‌ అమాయకంగా నటిస్తూ పోలీసులకు సైతం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన వాల్మీకిపురం సీఐ నాగార్జునరెడ్డి, కేవీపల్లె ఎస్‌ బాలకృష్ణ ఆధ్వర్యంలో బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కన్న కొడుకును తండ్రే హత్య చేయించినట్లు వెల్లడైంది. ఈ క్రమంలో ప్రధాన నిందితుడు జయరామ్‌తోపాటు రెడ్డివారిపల్లెకు చెందిన కొరముట్ల మల్లికార్జున, మదనపల్లెలోని రామిరెడ్డి లేఅవుట్‌కు చెందిన గదేముతక చంద్రశేఖర్, పుంగనూరు మండలం మేళందొడ్డికి చెందిన వడ్డీ సురేష్‌ను అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి రెండు సెల్‌ఫోన్లు, ఒక బైక్, రూ.2వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదించిన సీఐ నాగార్జునరెడ్డి, ఎస్‌ఐ బాలకృష్ణ, వెంకటేశ్వర్లు, రవిప్రకాష్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్‌ అన్వర్, కానిస్టేబుళ్లు రాజేష్‌రెడ్డి, మోహన్‌కుమార్, సురేష్, నాగార్జున, రాఘవేంద్రరెడ్డి, దొరబాబుకు డీఎస్పీ రివార్డు అందించారు.

చదవండి: 'నిన్ను మనసారా ప్రేమించా'.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య

మరిన్ని వార్తలు