తనకు పుట్టలేదనే అనుమానం.. రెండు నెలల పాపను బతికుండగానే..

23 Oct, 2021 11:43 IST|Sakshi

భార్యపై అనుమానంతో 2 నెలల చిన్నారిని చంపిన తండ్రి 

బిడ్డను సంచిలో కుక్కి.. నీటి కుంటలో పడేసి హత్య

అనంతపురం జిల్లాలో దారుణం.. నిందితుడ్ని అరెస్టు చేసిన పోలీసులు

కళ్యాణదుర్గం( అనంతపురం): అభంశుభం తెలియని రెండు నెలల పసిపాపను కన్నతండ్రే కర్కశంగా చంపేశాడు. జ్వరంతో బాధపడుతున్న చిన్నారిని బతికుండగానే సంచిలో కుక్కి.. రాయి కట్టి నీళ్లలో పడేసి దారుణంగా హత్య చేశాడు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. శెట్టూరు మండలం ఐదుకల్లుకు చెందిన మల్లికార్జునకు దాదాపు ఏడాదిన్నర కిందట బెళుగుప్ప మండలం నరసాపురానికి చెందిన చిట్టెమ్మతో వివాహమైంది. వీరికి రెండు నెలల పాప ఉంది.

జ్వరంగా ఉండడంతో చిన్నారిని గురువారం ఉదయం మల్లికార్జున, చిట్టెమ్మ కళ్యాణదుర్గంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ్నుంచి తాయత్తు కట్టించుకువస్తానని చిన్నారిని మల్లికార్జున తీసుకెళ్లిపోయాడు. ఎంతసేపటికీ వారు తిరిగి రాకపోవడంతో చిట్టెమ్మ తన కుటుంబసభ్యులను, బంధువులను ఆరా తీసింది. అయినా కూడా వారి ఆచూకీ తెలియకపోవడంతో గురువారం రాత్రి కళ్యాణదుర్గం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పట్టణ సీఐ తేజమూర్తి, ఎస్‌ఐ ఆశాబేగం సిబ్బందితో కలిసి పట్టణంలోని ఆస్పత్రుల్లో, బంధువుల ఇళ్లలో, సమీపంలోని అటవీ ప్రాంతంలో గాలించారు.

చివరకు దొడగట్ట వద్ద బైపాస్‌ రోడ్డుకు ఆనుకుని ఉన్న మురుగునీటి కుంట పక్కన చిన్నారి టవల్‌ను గుర్తించారు. రాత్రి పొద్దుపోయేదాకా కుంటతో పాటు పరిసరాల్లో గాలించారు. శుక్రవారం ఉదయం మల్లికార్జున అనంతపురంలో ఉన్నాడన్న సమాచారం తెలుసుకున్న పట్టణ సీఐ.. వెంటనే తన సిబ్బందితో వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచే వీడియో కాల్‌ ద్వారా చిన్నారిని కుంటలో పడేసిన ప్రాంతం గురించి చెప్పించారు. పోలీసులు, స్థానికులు కలిసి చిన్నారిని కట్టిపడేసిన సంచిని నీటి కుంట నుంచి బయటకు తీశారు.

అందులో విగతజీవిగా పడి ఉన్న చిన్నారిని చూసిన కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. బిడ్డ తనకు పుట్టలేదన్న అనుమానంతో, భార్యపై అనుమానంతో ఈ దారుణానికి పాల్పడినట్లు మల్లికార్జున పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం. చిన్నారి బతికుండగానే నోటికి ప్లాస్టర్‌ వేసి సంచిలో కుక్కి.. ఐదు కిలోల రాయి కట్టి కుంటలో పడేసినట్లు నిందితుడు తెలిపాడు. మల్లికార్జునపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. రిమాండ్‌కు తరలించారు. 

చదవండి: తండ్రి పట్టించుకోలేదని.. కుమారుడి కిరాతకం

  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు