వరంగల్‌లో విషాదం: కూతురు అదృశ్యం.. తండ్రి ఆత్మహత్య

17 Jul, 2021 09:14 IST|Sakshi
మృతదేహం వద్ద విలపిస్తున్న బంధువులు 

కూతురు ఆచూకీపై ఆవేదనతో అఘాయిత్యం

దర్యాప్తు చేపట్టిన పోలీసులు

పర్వతగిరి: వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరి మండలంలోని చౌటపల్లి గ్రామానికి చెందిన నాగరాజు శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మామునూరు ఏసీపీ నరేష్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. చౌటపల్లి గ్రామానికి చెందిన నాగరాజు కూతురు ఈనెల 8వ తేదీన కనబడం లేదని పర్వతగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు కరకగూడెంకు చెందిన చిన్నబోయిన సాయి, ఏటూరు నాగారం మండలం ఆజాద్‌నగర్‌కు చెందిన రాజశేఖర్‌ను విచారించినా.. బాలిక ఆచూకీ తెలియలేదు.

ఈ క్రమంలో శుక్రవారం బాలిక తండ్రి నాగరాజు తన కూతురు ఆచూకీపై మనస్తాపంతో ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవపడి మద్యం మత్తులో క్రిమిసంహారక మందు తాగి పోలీస్‌స్టేషన్‌ గేట్‌ వద్దకు వచ్చాడు. గమనించిన పోలీసులు పర్వతగిరి ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేస్తున్న క్రమంలోనే నాగరాజు మృతి చెందాడు. 

మైనర్‌ బాలిక ఏమైంది..?
ఈనెల 8వ తేదీన బాలిక తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటి నుంచి పోలీసుల దర్యాప్తులో ఎలాంటి పురోగతి లభించలేదు. గతంలో ఇదే మండలంలోని నారాయణపురం కంబాలకుంట తండాకు చెందిన బాలికలు భూమిక, ప్రియాంకలు చెన్నారావుపేటలోని ఖాదర్‌పేట గుట్టలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈక్రమంలో ప్రస్తుతం వారం రోజులు దాటినా బాలిక గురించి ఎలాంటి సమాచారం లేకపోవడం పలుఅనుమానాలకు తావిస్తుంది. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు