భార్యతో గొడవపడి పిల్లల గొంతు కోసేశాడు 

18 Aug, 2022 00:10 IST|Sakshi

తాను ఆత్మహత్యాయత్నం చేసుకున్న తండ్రి.. పరిస్థితి విషమం 

నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరు మండలంలో సంఘటన 

కోడేరు: భార్యతో గొడవ పడి.. క్షణికావేశంలో చిన్నారులను గొంతు కోసి హత్యచేసిన ఓ తండ్రి..ఆపై తాను ఆత్మహత్యాయత్నం చేశాడు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరు మండలంలో బుధవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కొల్లాపూర్‌ మండలం కుడికిల్ల గ్రామానికి చెందిన ఓంకార్‌ భార్య చనిపోవడంతో జావాయిపల్లి గ్రామానికి చెందిన మరో మహిళను రెండో వివాహం చేసుకున్నా డు.

అయితే తాగి జులాయిగా తిరుగుతుండటంతో ఆమె ఓంకార్‌ను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. కొన్నాళ్ల తర్వాత సొంతూరిలో మల్లేశ్వరిని మూడో పెళ్లి చేసుకున్నాడు. వీరికి విశ్వనాథం (7), చందన (3) పిల్లలున్నారు. కొల్లాపూర్‌కు మకాం మార్చి..సెంట్రింగ్‌ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 4 రోజుల క్రితం కుడికిల్లకు వచ్చాడు. బుధవారం కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయిస్తాన ని చెప్పి ద్విచక్రవాహనంపై భార్య, పిల్లలను ఎక్కించుకుని నాగర్‌కర్నూల్‌కు బయల్దేరాడు.

మార్గమధ్యలో భార్యాభర్తలు గొడవపడ్డారు. దీంతో భార్యను పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి వద్ద బైక్‌ నుంచి తోసేసి పిల్లల్ని తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత కోడేరు మండలం ఎత్తం శివారులో నాగులపల్లి వెళ్లే రోడ్డు పక్కన బైక్‌ను ఆపి.. ఇద్దరి పిల్లల్ని గట్టుపైకి తీసుకెళ్లి పొదల్లో వారి గొంతు కోసి చంపి తర్వాత తానూ గొంతు కోసుకున్నాడు. అయితే.. నొప్పి భరించలేక రోడ్డుపైకి వచ్చి పడిపోయాడు.

అటుగా వెళుతున్నవారు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు అక్కడి వచ్చి వివరాలు సేకరించారు. పిల్లలనూ చంపేశానని చెప్పాడు. ఓంకార్‌ను నాగర్‌కర్నూల్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, కుటుంబసభ్యులు గుట్టపైకి వెళ్లిచూడగా చనిపోయి ఉన్న పిల్లల మృతదేహాలు కనిపించాయి. కేసు దర్యాప్తు ప్రారంభించారు. 

మరిన్ని వార్తలు