వివాహేతర సంబంధం.. భర్తను చంపి గుండెపోటుగా చిత్రీకరణ.. మూడు నెలల తర్వాత..

17 Nov, 2022 17:08 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో విస్తుపోయే ఘటన జరిగింది. తండ్రి చనిపోయిన మూడు నెలల తర్వాత కూతురు షాకింగ్ విషయం కనిపెట్టింది. తన తల్లే తండ్రిని చంపిందని తెలిసి నమ్మలేక పోయింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో వాళ్లు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆ మహిళ నేరం అంగీకరించింది. తానే భర్తను చంపినట్లు ఒప్పుకుంది.

ఏం జరిగిందంటే..? 
రంజన రామ్తెకే భర్త విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి. ఆగస్టు 6న ఆయన గాఢ నిద్రలో ఉన్న సమయం చూసి రంజన అతడి మొహంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసింది. దీంతో అతను చనిపోయాడు. ఆ తర్వాత వెంటనే తన ప్రియుడికి ఫోన్ చేసింది. తన భర్తను చంపేశానని, తెల్లవారాక బంధువులకు ఫోన్ చేసి గుండెపోటుతో చనిపోయాడని చెబుతానని అతనికి చెప్పింది. చెప్పినట్లుగానే మరునాడు అలానే చేసింది.

అయితే బంధువులెవరికీ రంజనపై అనుమానం రాలేదు. నిజంగానే ఆమె భర్త గుండెపోటుతో చనిపోయాడు అనుకున్నారు. అంతిమసంస్కారాలు కూడా పూర్తయ్యాయి. అంతా ప్లాన్ ప్రకారమే జరగడంతో రంజన ఇక ప్రియుడితో హ్యాపీగా రిలేషన్ కొనసాగించవచ్చని సంబురపడింది.

మూడు నెలల తర్వాత రంజనను చూసేందుకు కూతురు శ్వేత వచ్చింది. ఓ కాల్ చేసుకునేందుకు తల్లి ఫోన్ తీసుకుంది. ఈ క్రమంలోనే కాల్ రికార్డులను పరిశీలించగా ఆమెకు షాకింగ్ విషయం తెలిసింది. రంజన తన భర్తను చంపాక ప్రియుడితో మాట్లాడిన కాల్ రికార్డు అందులో ఉంది. వెంటనే శ్వేత పోలీసులకు సమాచారం అందించింది. వారు రంగంలోకి దిగి రంజన, ఆమె ప్రియుడు ముకేశ్ త్రివేదిని విచారించగా.. నేరం అంగీకరించారు. దీంతో ఇద్దరిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
చదవండి: ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌కు కోర్టులో మరోసారి చుక్కెదురు

మరిన్ని వార్తలు