కూతురి ప్రేమకు తండ్రే విలన్... చంపమని రూ.లక్ష సుపారీ.. చివరకు..

7 Aug, 2022 12:02 IST|Sakshi

లక్నో: కన్నతండ్రే కూతురి పాలిట విలన్‌గా మారాడు. ఆమె ఓ యువకుడితో ప్రేమలో ఉందని తెలిసి మందలించాడు. అతడ్ని దూరం పెట్టమని పదే పదే హెచ్చరించాడు. అయినా ఆమె వినకపోవడంతో కిరాతక ఆలోచన చేశాడు. తన కుమార్తెను చంపమని హాస్పిటల్‌లో వార్డు బాయ్‌కి రూ.లక్ష సుపారీ ఇచ్చాడు. దీంతో అతడు ఆమెకు పోటాషియం క్లోరైడ్ అధిక మోతాదులో ఇంజెక్ట్ చేశాడు. ఫలితంగా యువతి తీవ్ర అనారోగ్యం పాలైంది. తండ్రితో పాటు వార్డు బాయ్‌, అతనికి సహకరించిన ఆస్పత్రిలో ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో శుక్రవారం ఈ ఘటన జరిగింది.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. కూతురు ప్రేమలో ఉందని తెలిసి నవీన్‌ కుమార్‌ అనే తండ్రి ఆమెపై కక్ష పెంచుకున్నాడు. తాను చెప్పినా వినడం లేదని ఆమెను హతమార్చాలనుకున్నాడు. ఈ క్రమంలో ఆ యువతి ఆనారోగ్యంపాలైందని శుక్రవారం రాత్రి మొరాదాబాద్‌ జిల్లా కంకర్‌ఖేడాలోని ఆస్పత్రిలో చేర్పించాడు.

ఆ తర్వాత కొద్ది గంటలకే ఆమెను ఫ్యూచర్ ఆస్పత్రికి మార్చాడు. కానీ కొద్ది సేపటికే యువతి ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. దీంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. పొటాషియం క్లోరైడ్ అధిక మోతాదులో ఇచ్చినట్లు గుర్తించారు. వెంటనే సీసీటీవీని పరిశీలించగా అసలు విషయం తెలిసింది. వార్డు బాయ్‌గా పనిచేసే నరేశ్ కుమార్‌ యువతికి ఇంజెక్షన్ ఇచ్చాడు. అతడికి ఓ మహిళా  ఉద్యోగి సహకరించింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. 

రంగంలోకి దిగిన వారు యువతి తండ్రితో పాటు వార్డు బాయ్‌ నరేశ్ కుమార్, మహిళా ఉద్యోగిని అరెస్టు చేశారు. నరేశ్ నుంచి రూ.90వేలు స్వాధీనం చేసుకున్నారు. విచారణతో తండ్రి నేరం అంగీకరించాడు. అంతేకాదు తన కూతురు కోతులను చూసి భయపడిందని చెప్పి ఆస్పత్రిలో అడ్మిట్ చేశానని, కానీ నిజానికి ఆమె ఇంటిపై నుంచి దూకిందని వెల్లడించాడు.
చదవండి: కన్నబిడ్డ హత్యకు వరుస ప్లాన్‌లు.. కసాయి తల్లిపై విచారణ

మరిన్ని వార్తలు