కూతురి ప్రేమ వ్యవహారం.. కుటుంబం పరువుపోతుందని..

26 Oct, 2022 01:50 IST|Sakshi
గీత (ఫైల్‌)  

ప్రేమ వ్యవహారం నేపథ్యంలో తండ్రి దారుణం 

వనపర్తి జిల్లాలో ఘటన 

పెబ్బేరు: కళ్లల్లో పెట్టుకొని చూసుకోవాల్సిన కూతురిని ఓ తండ్రి పొట్టనపెట్టుకున్నాడు. కూతురి ప్రేమ వ్యవహారంతో కుటుంబం పరువుపోతుందని భావించి క్షణికావేశంలో ఆమెను పొడిచి చంపాడు. ఈ సంఘటన మంగళవారం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పాతపల్లిలో చోటుచేసుకుంది. పాతపల్లికి చెందిన బోయ రాజశేఖర్, సునీత దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.

రెండోకూతురు గీత(15) పెబ్బేరులోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు, గీత ప్రేమించుకుంటున్నారనే విషయం తెలిసి రాజశేఖర్‌ తన కూతురిని మందలించాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. దీపావళి పండుగకు కుటుంబసభ్యులతో కలసి గీత అమ్మమ్మ ఊరైన వనపర్తి మండలం చందాపూర్‌కు వెళ్లింది.

సోమవారం సాయంత్రం తండ్రి, కూతురు పాతపల్లికి తిరిగి వచ్చేశారు. రాత్రి సమయంలో బయటికి వెళ్లి ఆలస్యంగా ఇంటికి వచ్చిన గీతను తండ్రి కొట్టాడు. మంగళవారం ఉదయం కూడా తండ్రి, కూతురు మధ్య గొడవ జరిగింది. క్షణికావేశానికిలోనైన రాజశేఖర్‌ చేతికి దొరికిన పదునైన ఆయుధంతో కూతురు గొంతు, చెవి, మెడ కింద భాగంలో పొడిచాడు. ఆ తర్వాత తన వ్యవసాయ పొలానికి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన గీత నానమ్మ శంకరమ్మ రక్తపు మడుగులో పడి ఉన్న మనుమరాలిని చూసి కేకలు వేసింది.

చుట్టుపక్కలవారు వచ్చి రాజశేఖర్‌కు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే డీఎస్పీ ఆనంద్‌రెడ్డి, కొత్తకోట ఇన్‌చార్జ్‌ సీఐ కేఎస్‌ రత్నం, ఎస్‌ఐ రామస్వామి, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్లూస్‌ టీంతో వివరాలు సేకరించారు. తండ్రిపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని విచారించగా తానే నరికి చంపినట్లు అంగీకరించాడు. పోలీసులు గీత మృతదేహాన్ని వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. 

మరిన్ని వార్తలు