కుమారుడిపై పెట్రోలు పోసి  నిప్పంటించిన తండ్రి 

26 Apr, 2021 10:53 IST|Sakshi
ఆస్పత్రిలో క్షతగాత్రుడిని వివరాలు అడిగి తెలుసుకుంటున్న ఎస్‌ఐ గంగాధర్‌

పామిడి(అనంతపురం జిల్లా): జూదానికి డబ్బు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన కన్నతండ్రి.. సొంత కుమారుడిపైనే హత్యాయత్నం చేసిన ఘటన పామిడిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ వి.గంగాధర్‌ తెలిపిన మేరకు.. పామిడిలోని టీచర్స్‌ కాలనీకి చెందిన ఖాజామొయిద్దీన్, నూరి దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహమైంది. పెద్దకుమారుడు జావేద్‌ వలి (24) ఆటో డ్రైవర్‌గానూ, రెండో కుమారుడు చాంద్‌బాషా టైలర్‌గానూ స్థిరపడ్డారు.

జులాయిగా తిరిగే ఖాజామొయిద్దీన్‌ పేకాట, మట్కా వంటి జూదాలకు బానిసయ్యాడు. శనివారం సాయంత్రం పేకాట ఆడేందుకు తనకు రూ.లక్ష కావాలని భార్యతో పాటు కుమారుడు జావేద్‌తో ఘర్షణ పడ్డాడు. వారు ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆదివారం తెల్లవారుజాము 1 గంట ప్రాంతంలో మిద్దెపై నిద్రపోతున్న జావేద్‌పై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. కుటుంబసభ్యులు, చుట్టుపక్కల వారు గమనించి మంటలు ఆర్పి, క్షతగాత్రుడిని వెంటనే అనంతపురం తరలించారు. 80శాతం కాలిన గాయాలతో సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు

చదవండి: ఒకే కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య  
మాయా జలం: మంచి నీటి పేరిట మహా మోసం 

మరిన్ని వార్తలు