పదే పదే ఆడపిల్లలు పుడుతున్నారని తండ్రి కర్కశం.. కూతుర్ని నేలకేసి కొట్టిన ఆటో డ్రైవర్‌

7 Aug, 2022 12:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సైఫాబాద్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏసీ ఘట్‌లో దారుణం జరిగింది. బాసిత్ అలీ ఖాన్ అనే ఆటో డ్రైవర్‌ తన మూడో కూతుర్ని కిరాతకంగా కొట్టాడు. ఆమె ఏడుస్తుందని ఆగ్రహంతో నేలకేసిబాది క్రూరంగా ప్రవర్తించాడు. నలుగురు సంతానం గల ఇతడు పదే పదే ఆడపిల్లలు పుడుతున్నారని శనివారం ఈ దారుణానికి పాల్పడ్డాడు. 

తీవ్ర గాయాలైన చిన్నారిని తల్లి సన నీలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడి వైద్యుల సూచన మేరకు పాపను ఉస్మానియా ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం వైద్యులు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.

భార్య సన  ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి బాసిత్ అలీ ఖాన్‌ను అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ఆడపిల్లలు పదే పదే పుట్టడంతో భార్య, పిల్లలపై దాడి చేసేవాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాసిత్ అలీ ఖాన్, సన 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు సంతానం.
చదవండి: కూతురి ప్రేమకు తండ్రే విలన్... చంపమని రూ.లక్ష సుపారీ.. చివరకు..

మరిన్ని వార్తలు