ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు కుమార్తె దారుణ హత్య

23 Jul, 2021 10:13 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గర్భవతి అని కూడా చూకుండా  కన్న కూతుర్నే హతమార్చిన  తండ్రి

కులాంతర వివాహం చేసుకుందని ఆగ్రహంతోనే హత్య

ధన్‌బాద్‌: జార్ఖండ్‌లో కుల దురహంకార హత్య కలకలం రేపింది. కులాంతర వివాహం చేసుకుందన్న ఆగ్రహంతో కన్నకూతురినే హతమార్చిన అమానుష ఘటన మానవత్వాన్ని మంట గలిపింది.  కుమార్తెను నమ్మించి  గొంతు కోసి హత్య చేసిన  ఘటన  జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో  చోటు చేసుకుంది.  

పోలీసుల సమాచారం ప్రకారం జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు రాంప్రసాద్ కుమార్తె ఖుష్‌బూ కుమారి (20) తొమ్మిది నెలల క్రితం, కుటుంబ సభ్యుల  అనుమతి లేకుండా ప్రేమించిన వ్యక్తి పెళ్లి చేసుకుంది. అయితే ఈ పెళ్లిని అంగీరించలేని తండ్రి ఆమెను ఎలాగైనా మట్టుబెట్టాలని పథకం వేశాడు. ఇందులో భాగంగా  తమ ల్యాండ్‌ను చూపిస్తాను రమ్మని కూతురిని నమ్మించాడు. అప్పటికే ఏడు నెలల గర్భవతి అయిన ఖుష్బూ తండ్రితో పాటు తల్లి కూడా ఉండటంతో పూర్తిగా నమ్మి వారితో బయలు దేరింది.  తండ్రి పన్నాగాన్ని పసిగట్టలేకపోయింది.

యారియా టౌన్‌షిప్ నుంచి గోవింద్‌పూర్ నవతాండ్‌ వద్దకు ఆటోలో వ్యవసాయ క్షేత్రం చూపించడానికి తీసుకువచ్చాడు రాంప్రసాద్‌. అక్కడ అదను చూసి తన ప్లాన్‌ అమలు చేశాడు. గర్భవతి అని కూడా చూడకుండా పదునైన ఆయుధంతో  కూతురి గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావంతో  కొట్టుమిట్టాడుతున్న కుమార్తెను చూసి తల్లి పెద్దగా అరుస్తూ, సాయం కోసం ఏడుపు ప్రారంభించడంతో, అతను అక్కడి నుంచి పారిపోయాడు. అయితే అప్పటికే ప్రాణాలు కోల్పోయిన ఖుష్బూని చూసి తల్లి మూర్ఛపోయింది. స్థానికులు  సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తల్లిని ఆసుపత్రికి తరలించారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు ఈ సంఘటన జరిగిందని గోవింద్‌పూర్ ఇన్‌స్పెక్టర్ సురేంద్ర కుమార్ సింగ్ మీడియాకు తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు. 

మరిన్ని వార్తలు