కుమారుడితో కలిసి తండ్రి ఆత్మహత్య 

26 Oct, 2022 02:02 IST|Sakshi
ఆత్మహత్య చేసుకున్న తండ్రీకుమారులు రామారావు, గోపీనంద్‌ (ఫైల్‌)  

రైలు కింద పడి బలవన్మరణం 

భార్య వివాహేతర సంబంధమే కారణం 

ఎర్రుపాలెం: భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం నెరపడాన్ని తట్టుకోలేని వ్యక్తి తన కుమారుడితో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల సమీపంలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం పట్టణానికి చెందిన రేషన్‌ డీలర్‌ తన్నీరు రామారావు(34) సతీమణి అదే పట్టణానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇరువురు సన్నిహితంగా ఉండటాన్ని చూసిన రామారావు తట్టుకోలేకపోయాడు.

ఈ క్రమంలో ఆయన జి.కొండూరు మండలం చెరువు మాధవరంలో నివాసముంటున్న తన చిన్నమ్మ ఇంటికి కుమారుడు గోపీనంద్‌(07)తో కలిసి వచ్చాడు. అక్కడ తన భార్య నిర్వాకాన్ని చిన్నమ్మ, బంధువులకు వివరించాడు. ఆ తర్వాత బయటకు వెళ్తున్నట్లు చెప్పి ద్విచక్ర వాహనంపై కొడుకును తీసుకుని చెరువు మాధవరానికి సమీపంలోని ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల రైల్వే గేట్‌ వద్దకు వచ్చి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై మృతుడి చిన్నాన్న రేపాని వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.  

మరిన్ని వార్తలు