క్షవరం విషయంలో గొడవ.. దళిత యువకులపై దాడి..

10 Jun, 2021 15:11 IST|Sakshi

బెంగళూరు : తమ ఏరియాలోకి అడుగు పెట్టారన్న కోపంతో దళిత యువకులపై దాడికి దిగారు కొందరు ఉన్నత వర్గానికి చెందిన వారు. క్షవరం విషయంలో చోటుచేసుకున్న ఈ గొడవ కారణంగా ఆ ఇద్దరు దళిత యువకులు ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ సంఘటన కర్ణాటకలోని యల్‌బుర్గ తాలూకాలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. యల్‌బుర్గ తాలూకాలోని హోసల్లి గ్రామానికి చెందిన హనమంత,  బసవరాజ్‌ అన్నదమ్ములు. వీరు అక్కడి దళిత కాలనీలో నివాసం ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం ఇద్దరూ హేయిర్‌ కటింగ్‌ చేయించుకోవటానికి క్షరకులు మల్లప్ప, కలగప్పలను సంప్రదించారు. వీరు లాక్‌డౌన్‌ కారణంగా షాపులు మూతపడటంతో పిలిచిన వారి ఇంటికి వెళ్లి క్షవరం చేయటం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో మల్లప్ప,కలగప్పలు క్షవరం చేస్తున్న ఉన్నత వర్గాల ఏరియాలోకి హనమంత, బసవరాజ్‌లు అడుగుపెట్టారు. తమకు కూడా క్షవరం చేయాలని అడిగారు. దళిత యువకులు తమ ఏరియాలోకి అడుగుపెట్టడంతో ఉన్న వర్గాల జనం వారిని చుట్టూ మూగారు.

దీంతో భయపడిపోయిన క్షరకులు దళిత యువకుల్ని అక్కడినుంచి వెళ్లిపోవాల్సిందిగా కోరారు. అయితే, వారు ఇదేమీ పట్టించుకోకుండా.. తమకు కూడా క్షవరం చేయాలని, డబ్బులు ఇస్తామని అన్నారు. చుట్టూ మూగిన జనం కూడా వారిని వెళ్లిపోమని అడిగారు. అయినా వాళ్లు వినకపోవటంతో బూతులు తిడుతూ, కొట్టి పంపించేశారు. ఈ అవమానాన్ని తట్టుకోలేకపోయిన అన్నదమ్ములిద్దరూ ఇంటికి వెళ్లి పురుగుల మందు తాగారు. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఇద్దర్నీ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ కావటంతో పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటనపై సీరియస్‌ అయ్యారు. పోలీసులు 16 మందిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆరుగురి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  

మరిన్ని వార్తలు