కో ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ: నమ్మించి.. ముంచేసి!

23 Jul, 2021 21:31 IST|Sakshi
బాధితులతో మాట్లాడుతున్న ఎస్పీ మలికా గర్గ్‌

వేటపాలెం కో ఆపరేటివ్‌ క్రెడిట్‌  సొసైటీలో నిధులు గోల్‌మాల్‌  

సొంత ఖాతాలకు 30 కోట్ల రూపాయలు బదలాయింపు 

మేనేజర్‌తో పాటు కమిటీ సభ్యులదీ కీలక పాత్ర 

దేవుడి సొమ్మునూ వదలని అక్రమార్కులు 

మేనేజర్‌ కోసం ప్రత్యేక బృందం గాలింపు 

సాక్షి, చీరాల/వేటపాలెం: వేటపాలెం కో ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీలో ఒక్కో అక్రమం వెలుగులోకి వస్తోంది. సొసైటీని కొన్నేళ్లపాటు సజావుగానే నడిపారు. వడ్డీ తక్కువ అయినా కష్టపడిన సొమ్ము భద్రంగా ఉంటుందన్న ఆశతో చిరు వ్యాపారులు తమ డబ్బును అందులో దాచుకున్నారు. ఇళ్లలో పాచిపనులు చేసుకొనే నిరు పేదలు తాము సంపదించిన సొమ్మును ఆ సొసైటీలో ఉంచారు. దేవుడి సొమ్ముకు  ఇక్కడైతేనే గ్యారంటీ ఉంటుందన్న ఉద్దేశంతో కొన్ని దేవస్థానం కమిటీలు కూడా డిపాజిట్‌ చేశాయి. మొదటిలో లావాదేవీలన్నీ సజావుగా సాగాయి.

సొసైటీ కూడా లాభాల్లోకి వెళ్లింది. కొనేళ్లగా సొసైటీ మేనేజర్‌తో పాటు కమిటీ పెద్దలకు దుర్బుద్ధి పుట్టింది. ప్రజల డిపాజిట్‌లపై కన్నుపడింది. స్వాహా చేయాలని ప్లాన్‌ వేశారు. అందుకు మేనేజర్‌ను ఉసిగొల్పారు. అన్ని తానై నడిపిస్తున్న మేనేజర్‌ ఇందులో కీలకపాత్ర పోషించారు. సొమ్మును స్వాహా చేసి కమిటీ సభ్యులతో చేతులు కలిపి వాటాల రూపంలో పంచుకున్నట్లు సమాచారం. ఇలా చీరాల నియోజకవర్గం పరిధిలో వేటపాలెం, జాండ్రపేట, చీరాల, ఈపుపాలెం, పందిళ్లపల్లి, రామన్నపేట గ్రామాల పరిధిలో 1200 మంది ఖాతాదారులు రూ. 30 కోట్లు పైచిలుక కట్టి ఉన్నారు. ఇందులో చేనేత కార్మికులు కూడా ఉన్నారు.  

ఇదీ..జరిగింది 
వేటపాలెంలో ప్రధాన బ్యాంకులు ఏర్పాటు కాక ముందు అంటే 1945 ఆక్టోబర్‌ 15న కొందరు ప్రైవేటు వ్యక్తులు ఓ సొసైటీని ఏర్పాటు చేశారు. అప్పటిలో అర్బన్‌ బ్యాంకుగా నామకరణం చేశారు. తదుపరి వేటపాలెం కో ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీగా మార్చేశారు. ప్రస్తుతం ఉన్న బ్యాంకుల కంటే ఒక్క శాతం ఎక్కువ వడ్డీ ఇస్తామని ఖాతాదారులకు నమ్మకం కలిగించారు. తక్కువ సమయంలోనే నగదు వేయడం.. తీసుకోవడం సులభతరంగా ఉండటంతో పాటు ఒక్క శాతం వడ్డీ అధికంగా వస్తుందని ఎక్కువ మంది తమ నగదు రూ.లక్షల్లో డిపాజిట్‌లు చేశారు.

సొసైటీ ఏర్పాటు చేసి 70 ఏళ్లు దాటడంతో పాలకవర్గంపై ఖాతాదారులకు నమ్మకం కలిగింది. ఎక్కువ మంది డిపాజిట్‌లు చేశారు. కార్యవర్గ సభ్యులు ప్రతినెలా సొసైటీ కార్యకలాపాలు, లావాదేవీలపై సమావేశాలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం గడువు తీరిన డిపాజిట్‌దార్లకు సొసైటీ నెల రోజులుగా నగదు చెల్లించక పోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. డిపాజిట్‌దారులు తమ నగదు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. మేనేజర్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి పారిపోయాడు. బాధితులు వేటపాలెం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సొసైటీ పాలకవర్గ సభ్యులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.  
పరారీలో మేనేజర్‌  
సొసైటీ మేనేజర్‌ ఆదివారం నుండి పరారీలో ఉన్నాడు. ఎస్‌ఐ కమలాకర్‌ కేసు నమోదు చేసుకొని మేనేజర్‌ కోసం ప్రత్యేక బృదంతో గాలిస్తున్నారు. మేనేజర్‌ దొరికితేగానీ  రూ.30 కోట్లు నగదు ఎమైంది తెలియదు. పాలకవర్గ సభ్యుల ఆస్తులు విక్రయించి తమ నగదు తమకు ఇప్పిచాలని ఎస్పీ మలికా గర్గ్‌ను బాధితులు వేడుకుంటున్నారు. 

ఎమ్మెల్యే కరణానికి వినతిపత్రం 
వేటపాలెం సొసైటీలో తాము దాచుకున్న డిపాజిట్‌లు గల్లంతు చేసి మేనేజర్‌ పారిపోయాడని బాధితులు ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తికి దృష్టికి తీసుకెళ్లారు. తాము కష్టపడి కూలినాలీ చేసుకొని, చిన్నాచితకా వ్యాపారాలు చేసుకొని దాచుకొన్న డబ్బులు స్వాహా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము దాచుకున్న నగదు తమకు ఇప్పించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇచ్చారు.

బాధితులకు న్యాయం చేస్తాం: ఎస్పీ 
వేటపాలెం: వేటపాలెం కో ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీలో డిపాజిట్‌లు చేసిన బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని ఎస్పీ మలికా గర్గ్‌ భరోసా ఇచ్చారు. గురువారం వేటపాలెం పోలీసుస్టేషన్‌ సందర్శనకు వచ్చిన ఆమెను బాధితులు కలిసి తమ సమస్య విన్నవించుకున్నారు. వివిధ రకాల వృత్తులపై ఆధారపడి జీవనం సాగించుకుంటున్న దాదాపు 1200 మంది రూ.30 కోట్లకుపై చిలుకు సొసైటీలో డిపాజిట్‌ల రూపంలో నగదు దాచుకున్నారని తెలిపారు. ఈ ప్రాంతంలో వివిధ దేవస్థానాలకు చెందిన రూ.30 లక్షలు డిపాజిట్‌లు సైంతం సొసైటీలో ఉన్నాయన్నారు. డిపాజిట్‌ల కాలపరిమితి ముగిసినా డబ్బులు ఇవ్వకుండా కార్యదర్శి(మేనేజర్‌) పారిపోయాడని బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

సొసైటీలో దాచుకున్న నగదు తిరిగిరాని పక్షంలో కొంత మంది ఆత్మహత్యలు చేసుకోనే పరిస్థితి ఉందని ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు.  తమ డబ్బులు తమకు ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. ఎస్పీ మాట్లాడుతూ సొసైటీ నిర్వాహకులపై కేసులు నమోదు చేశామని తెలిపారు. పారిపోయిన మేనేజర్‌ను పట్టుకుని చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కేసును అధికారులు సీరియస్‌గా తీసుకున్నారని ఎస్పీ మలికా గర్గ్‌ తెలిపారు. ఆమెతో పాటు చీరాల డీఎస్పీ శ్రీకాంత్‌ ఉన్నారు. 

మరిన్ని వార్తలు